Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్.. ఈ ప్రశ్నలకు ఏం చెబుతాడు?

By:  Tupaki Desk   |   24 Nov 2015 6:45 AM GMT
అమీర్ ఖాన్.. ఈ ప్రశ్నలకు ఏం చెబుతాడు?
X
హిందువులు - ముస్లింలు అని తేడా లేకుండా అందరి అభిమానం అందుకున్న కథానాయకుల్లో అమీర్ ఖాన్ ఒకడు. మిగతా ఇద్దరు ఖాన్స్ అయినా ముస్లింలు అని గుర్తొస్తుంది కానీ.. అమీర్ ను మాత్రం ఆ కోణంలో చూడరు జనాలు. సమాజానికి ఏదో చేయాలన్న అమీర్ తపన.. అతడి వ్యక్తిత్వం జనాలకు నచ్చుతుంది. అలాంటి వాడు ఓ అనవసర వివాదంలోకి దిగి.. తిట్లు తీసుకుంటున్నాడు. దేశంలో మత అసహనం గురించి జరుగుతున్న చర్చలోకి అతను కూడా వచ్చేయడం.. తన భార్య ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోదామా అని అడిగిందని చెప్పడం.. దేశంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించడంపై సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనిపై చాలామంది సినీ ప్రముఖులే విమర్శలు గుప్పించారు.

నిజంగా మన దేశంలో మత అసహనం ఎక్కువ ఉన్నట్లయితే ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా ముగ్గురు ముస్లింలు (అమీర్ - షారుఖ్ - సల్మాన్) ఉండేవారు కాదని.. దీన్ని బట్టే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని రాంగోపాల్ వర్మ అన్నాడు. కొందరిలో అభద్రత భావాన్ని అందరికీ ఆపాదిస్తున్నారని వర్మ చెప్పాడు. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ - పరేష్ రావల్ కూడా అమీర్ పై మండిపడ్డారు. అమీర్ భార్య కిరణ్ ఏ దేశానికి వెళ్లాలనుకుందో చెప్పిందా, ఆమెకు ఈ దేశమే తనను ఇంత పెద్ద స్టార్ ని చేసిందని అమీర్ చెప్పాడా అని అనుపమ్ ప్రశ్నించాడు. పీకే సినిమాలో అమీర్ హిందూ దేవుళ్లపై సెటైర్లు వేస్తూ కామెడీ చేశాడని.. కానీ హిందువులు తమ అసహనం చూపించకుండా సినిమాను చాలా పెద్ద హిట్ చేశారని.. దీనిపై అమీర్ ఏమంటాడని పరేష్ రావల్ ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నలకు అమీర్ ఏమని బదులిస్తాడో చూడాలి.