Begin typing your search above and press return to search.

‘భరత్ అనే నేను’ గొప్పదనం చెప్పిన సీనియర్

By:  Tupaki Desk   |   27 April 2018 5:58 AM GMT
‘భరత్ అనే నేను’ గొప్పదనం చెప్పిన సీనియర్
X
దాదాపు 350 సినిమాలకు పని చేసిన అనుభవం పరుచూరి సోదరులది. గత కొన్నేళ్లలో వాళ్లకు సినిమాలు తగ్గిపోయాయి. అలాగని వాళ్లేమీ పూర్తిగా ఖాళీ అయిపోలేదు. ‘ఖైదీ నంబర్ 150’.. ‘సైరా’ లాంటి మెగా ప్రాజెక్టులకు రచనా సహకారం అందించారు. మెగాస్టార్ లాంటి వాళ్లు కథల మీద జడ్జిమెంట్ కోసం వారినే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పరుచూరి గోపాలకృష్ణ తన అనుభవాన్ని పాఠాల రూపంలో వర్తమాన రచయితలు.. దర్శకులకు చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన తాను పని చేసిన పాత సినిమాల గురించే కాక.. కొత్తగా రిలీజయ్యే చిత్రాల గురించి కూడా యూట్యూబ్ లో విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా ఆయన ‘భరత్ అనే నేను’ సినిమాను విశ్లేషించారు. మహేష్ బాబు నట కౌశలాన్ని.. కొరటాల దర్శకత్వ ప్రతిభను పరుచూరి కొనియాడారు.

తనకు సినిమాలో అత్యంత నచ్చిన విషయం గురించి చెబుతూ.. జాతర దగ్గర వచ్చే వచ్చాడయ్యో సామి పాటను ఉదహరించారు పరుచూరి. మామూలుగా ఇలాంటి సందర్భంలో ఐటెం సాంగ్ పెట్టేస్తుంటారని.. కమర్షియల్ గా అది బాగా వర్కవుట్ అవుతుందని దర్శకులు నమ్ముతారని పరుచూరి అన్నారు. ఇంతకుముందు కొరటాల చేసిన ‘జనతా గ్యారేజ్’లోనూ అలాంటి పాట చూడొచ్చన్నారు. ఐతే ‘భరత్ అనే నేను’ కథ భిన్నమైందని.. చాలా సీరియస్ గా.. ఒక ప్రయోజనంతో సాగుతుందని.. ఇలాంటి సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఔచిత్యం దెబ్బ తింటుందనే ఉద్దేశంతో కొరటాల నిగ్రహించుకుని వచ్చాడయ్యో సామి లాంటి మంచి పాట పెట్టాడని పరుచూరి అన్నారు. కొరటాల ఎక్కడా కమర్షియల్ గా ఆలోచించలేదనడానికి ఇది నిదర్శనమని.. అతడి సిన్సియారిటీ తనకు నచ్చిందని.. జనాలు కూడా సినిమాను ఎంతో ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు.