Begin typing your search above and press return to search.

అల్లూరి డైలాగ్స్ లో అగ్ని పుట్టించిన ఘనుడు!

By:  Tupaki Desk   |   2 Jun 2021 7:30 AM GMT
అల్లూరి డైలాగ్స్ లో అగ్ని పుట్టించిన ఘనుడు!
X
త్రిపురనేని మహారథి గొప్ప రచయిత .. ఎన్నో భారీ సినిమాలకు ఆయన కథలను అందించారు. సంభాషణల రచనలోను ఆయన శైలి అద్భుతంగా ఉంటుంది. ఎన్టీఆర్ .. కృష్ణ సినిమాలకు ఆయన ఎక్కువగా పనిచేశారు. జానపద .. చారిత్రక చిత్రాలపై ఆయన తనదైన ముద్రవేశారు. ఉద్యమభరితమైన .. ఉద్వేగ పూరితమైన సంభాషణలు రాయడంలో ఆయన సిద్ధహస్తులు. అలాంటి ఆయన గురించి ఈ వారం 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

"మహారథి గారిని నేను బాబాయ్ .. అని పిలిచేవాడిని. ఆయన మా అన్నయ్యను 'ఏరా పెద్దోడా' అనీ .. నన్ను 'ఏరా చిన్నోడా' అని పిలిచేవారు. మేము సినిమా ఫీల్డ్ కి రాకముందే ఆయన గొప్ప గొప్ప సినిమాలకు రాశారు. ఆయనతో బాగా పరిచయం పెరిగిన తరువాత "బాబాయ్ నీ అక్షరాల్లో అగ్ని ఉంటుంది" అని నేను అంటే ఆయన నవ్వేవారు. నిజంగా ఆయన సంభాషణా చతురుడు. అటు రామారావుగారి 'బందిపోటు' .. ఇటు కృష్ణగారి 'సింహాసనం' .. ఈ రెండు సినిమాలకు రచయిత ఆయనే. ఒకే కథను ఇద్దరు హీరోలతో చేసి సూపర్ హిట్ చేయడం ఆయన రచనా పటిమకు నిదర్శనం.

రచయితగా ఆయన చేసిన మరో భారీ సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. అటు ఎన్టీఆర్ .. ఇటు కృష్ణలలో ఎవరి పాత్రకు అన్యాయం జరగకుండా ఆయన చూసుకున్నారు. ఇక ఆయన చేసిన మరో గొప్ప సినిమా 'అల్లూరి సీతారామరాజు'. ఆ సంభాషణలు వింటూ రోమాలు నిక్కబొడుచుకోనివారు ఎవరైనా ఉంటారా? ఆ సినిమాతో ఆయన ఒక చరిత్రను సృష్టించారు. జీవితంలో ఆయన సాధించిన గొప్ప విజయంగా ఈ సినిమా కనిపిస్తుంది. ఆయనతో కలిసి పనిచేయలేకపోయానే అనే ఒక బాధ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.