Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాల లైన్ కూడా ఇదేన‌న్న ప‌రుచూరి

By:  Tupaki Desk   |   8 Oct 2022 1:30 AM GMT
ఆ రెండు సినిమాల లైన్ కూడా ఇదేన‌న్న ప‌రుచూరి
X
మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు కొత్త క‌థ‌లు రాయ‌డం అన్న‌ది చాలా అరుదు. ఇటీవ‌లి కాలంలో ఒరిజిన‌ల్ క‌థ‌ల కంటే రీమేక్ లు ఎక్కువ‌య్యాయి. నిజానికి సొంత క‌థ‌ల్లో ఏదైనా లైన్ అనుకున్నా ఫ‌లానా కొరియ‌న్ సినిమా లేదా ఫ‌లానా హాలీవుడ్ మూవీ థీమ్ ఇలానే ఉంటుంది అని విశ్లేషించేవాళ్ల‌కు కొద‌వేమీ లేదు.

యూట్యూబ్ మాధ్య‌మంలో సినీప్రియులు ఎవ‌రికి వారు ఫ‌లానా సినిమాలా ఉందే అంటూ కొత్త సినిమాల‌పై రివ్యూలు ఇచ్చేయ‌డం చూస్తున్న‌దే. అయితే దిగ్గజ ర‌చ‌యిత .. ద‌ర్శ‌క‌న‌టుడు ప‌రుచూరి గోపాల‌కృష్ణ ఇటీవ‌లే విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌ల‌మైన‌ రామ్ `వారియ‌ర్` మూవీపై త‌న‌దైన శైలిలో స‌మీక్షించారు. ఈ సినిమా క‌థ‌ తెలుగులోనే విడుద‌లై విజ‌యం సాధించిన మ‌రో రెండు సినిమాల మూల‌క‌థ‌ను పోలి ఉంద‌ని కూడా బ‌హిర్గ‌తం చేసారు.

ఈ సినిమా కంటే ముందే ఇలాంటి క‌థ‌తో వ‌చ్చిన మాన‌వుడు దాన‌వుడు- స‌ర్ప‌యాగం చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయ‌ని కానీ కొన్ని త‌ప్పిదాల వ‌ల్ల లింగుస్వామి `వారియ‌ర్` ఫ్లాపైంద‌ని ఆయ‌న విశ్లేషించారు. ఈ చిత్రంలో రామ్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని.. కృతి శెట్టితో ప్రేమ స‌న్నివేశాలు బాగా పండాయ‌ని.. అయితే ఆది పినిశెట్టి విల‌నీ హీరోయిజాన్ని డామినేట్ చేసింద‌ని కూడా ప‌రుచూరి వారు విశ్లేషించారు.

డైలాగుల‌తోనే విల‌న్ ని గొప్ప‌గా హైలైట్ చేసిన తీరును ప్ర‌శంసించారు. క్లైమాక్స్ ని అలాగే కొన్ని స‌న్నివేశాల‌ను మ‌రోలా తీయాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న త‌న విశ్లేష‌ణ తెలిపారు. ద‌ర్శ‌కుడు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంద‌ని సూచించిన ప‌రుచూరి .. ర‌చ‌యిత‌ల‌కు కూడా ఒక చ‌క్క‌ని సూచ‌న చేసారు.

ఏ హీరో కోసం క‌థ రాస్తున్నారో ఆ హీరోకి అప్పుడు ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాయాల‌ని సూచించారు. ఓవరాల్ గా వారియ‌ర్ బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌ను త‌న‌దైన అనుభ‌వంతో ఆయ‌న విశ్లేషించిన తీరు ఆక‌ట్టుకుంది. టాలీవుడ్ లో దాదాపు 350 పైగా చిత్రాల‌కు క‌థ‌లు అందించిన అనుభ‌వం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సొంతం. ప‌రుచూరి గోపాల‌కృష్ణ న‌టుడిగా ర‌చ‌యిత‌గా అనుభ‌వ‌జ్ఞులు. దర్శ‌కుడిగాను కొన్ని సినిమాలు తీసారు. ప్ర‌స్తుతం యూట్యూబ్ లో ఆయ‌న రివ్యూలు వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.