Begin typing your search above and press return to search.

ఫిదా స్టోరీపై పరుచూరి లెసన్స్

By:  Tupaki Desk   |   14 Oct 2017 6:52 AM GMT
ఫిదా స్టోరీపై పరుచూరి లెసన్స్
X
ఫిదా.. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. పెట్టుబడిపై డబ్బులు రాబట్టడం విషయానికి వస్తే.. అతి పెద్ద హిట్ అనేయచ్చు. తెలంగాణ అమ్మాయికి.. విదేశీ కుర్రాడికి మధ్య లవ్ స్టోరీని హృద్యంగా చూపించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల బాగా సక్సెస్ అయ్యాడు. అయితే.. ఈ మూవీలో కీలకమైన పాయింట్.. పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి అబ్బాయి ఎందుకు రాకూడదు అనే.

ఫిదా స్టోరీపై సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఇప్పుడు కొన్ని పాఠాలను చెబుతున్నారు. కుటుంబాన్ని వదిలేసి అక్క వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినపుడు.. ఆమెను వెళ్లనీయకుండా ఆపేసి.. అక్క-బావల కాపురంలో ఆ చెల్లెలు కలతలకు కారణం కావచ్చు. ఇది స్త్రీ వాదం అంటున్నారు పరుచూరి. ఆ తర్వాత అక్క కాపురం ఎలా దారిలోకి వచ్చింది.. ఆ చెల్లెలు ఏం రియలైజ్ అయింది.. ఎలా తన అక్క-బావలను కలిపే యాంగిల్ లో ఈ స్టోరీ రాసుకోవచ్చు.

ఇదే సినిమా కథను.. మరోలా కూడా చెప్పచ్చని అన్నారు పరుచూరి. తన మాట వినకుండా బావతో వెళ్లిపోయిన అక్కను చూసిన ఆ చెల్లెలు.. ఇల్లరికం ఉండే భర్త కోసం ప్రయత్నించడం.. పేపర్ లో ప్రకటన ఇవ్వడం లాంటివి చేయచ్చని చెప్పారాయన. అంతగా ఆమె వెతుక్కుని చేసుకున్నా.. ఆ తర్వాత కలతలు.. విబేధాలు సినిమా స్టోరీ అవుతుంది.

ఇక ఈ మూవీ కథను మరో యాంగిల్ లో కూడా చెప్పచ్చని అంటున్నారు పరుచూరి వారు. అక్క వెళ్లిపోవడం.. తండ్రి దిగులుతో మంచాన పడి మరణించడం.. ఆమె అభ్యుదయ భావాలు.. కమ్యూనిస్ట్ భావాలతో ఇతర స్త్రీలకు హితబోధ చేసే ప్రయత్నం చేయడం లాంటివి చేయవచ్చు.

ఇలాంటి యాంగిల్స్ లో సినిమాలు తీసుంటే అవి ఎంతవరకూ జనాలను మెప్పించేవనే పాయింట్ ను పక్కన పెడితే.. ఒక కథకు ఇన్నేసి రూపాలు ఇవ్వవచ్చంటూ తన స్టైల్ లో ఫిదా పాఠాలు చెబుతున్నారు పరుచూరి గోపాలకృష్ణ.