Begin typing your search above and press return to search.

పరుచూరి పేరు మోహన్ బాబు ఎందుకు మార్చేశారు?

By:  Tupaki Desk   |   4 Jun 2016 6:39 AM GMT
పరుచూరి పేరు మోహన్ బాబు ఎందుకు మార్చేశారు?
X
టాలీవుడ్ లెజెండరీ రైటర్లలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. తన అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి 300 సినిమాలకు పైగా రచన చేసిన ఘనత ఆయనది. ముఖ్యంగా 80లు.. 90ల్లో పరుచూరి సోదరులు తెలుగు సినిమాను ఏలారనే చెప్పాలి. వాళ్లిద్దరి కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘అసెంబ్లీ రౌడీ’ ఒకటి. ఈ సినిమా విడుదలై నేటితో పాతికేళ్లు పూర్తవడం విశేషం. ఈ సందర్భంగా ‘అసెంబ్లీ రౌడీ’ తనకెంత ప్రత్యేకమో చెబుతూ ఆసక్తికర విశేషాలు వెల్లడించారు గోపాలకృష్ణ.

‘‘నేను ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తణుకులో ఉండగా మోహన్‌బాబు ఓ తమిళ సినిమా వీడియో క్యాసెట్ ఇచ్చి చూడమన్నారు. సినిమా పూర్తి కాకముందే మధ్యలోనే ఇది రీమేక్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చేయమని మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుకి చెప్పారు మోహన్ బాబు. ఐతే ఆయన క్లాస్ టచ్ ఇస్తూ రాసేసరికి మోహన్‌బాబు షాకయ్యాడు. తర్వాతి రోజు నేను ఉదయం ఏడింటికి మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకల్లా స్క్రిప్టు పూర్తి చేసేశాను. మోహన్ బాబుకి ఫోన్ చేసి విషయం చెబితే.. స్క్రిప్టు టకటకా చుట్టేశావా అన్నారు. నేను వెంటనే ‘అరిస్తే కరుస్తా...’ అనే డైలాగ్ చెప్పాను. మిగతా స్క్రిప్టు కూడా వినిపించాను. వెంటనే సినిమా పట్టాలెక్కేసింది. ‘అసెంబ్లీ రౌడీ’ ప్రివ్యూ చూసి చాలా మంది పెదవి విరిచారు. కానీ సినిమా సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు నా పేరు మార్చేశారు. ‘అగ్రజా’ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది’’ అని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.