Begin typing your search above and press return to search.

'పఠాన్' టీజర్: హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ తో తిరిగొచ్చిన కింగ్ ఖాన్..!

By:  Tupaki Desk   |   2 Nov 2022 7:19 AM GMT
పఠాన్ టీజర్: హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ తో తిరిగొచ్చిన కింగ్ ఖాన్..!
X
'జీరో' ప్లాప్ తర్వాత గెస్ట్ అప్పీయరెన్స్ లకే పరిమితమైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ''పఠాన్‌'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ గా పేర్కొనబడిన ఈ చిత్రానికి 'వార్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

'పఠాన్‌' సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పడుకునే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని రూపొందించారు.

కింగ్ ఖాన్ ''పఠాన్'' చిత్రాన్ని 2023 రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. హిందీతో పాటుగా తెలుగు తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆవిష్కరించిన షారుక్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న టీజర్ ను ఈరోజు షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. 'పఠాన్ గురించి నీకు ఏమేమి తెలుసు?' అనే వాయిస్ తో ప్రారంభమైన ఈ టీజర్.. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగింది.

ఇందులో షారుఖ్ ఒక గూఢచారి పాత్రలో కనిపించారు. మూడేళ్ళ క్రితం చివరి మిషన్ లో పట్టుబడిన తర్వాత అతను ఏమైపోయాడో ఎవరికీ తెలియదని.. అతన్ని చిత్రహింసలకు గురిచేసారని విన్నానని.. అతను బ్రతికున్నాడో లేదో కూడా తెలియదని చెప్తుండగా.. 'జిందా హై' అని షారుక్ చెప్పడాన్ని మనం టీజర్ లో చూడొచ్చు.

టీజర్ లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. చాలా ఏళ్ళ తర్వాత షారూఖ్ అద్భుతమైన స్టంట్స్ తో అదరగొట్టాడు. దీపికా పదుకొణె గ్లామరస్‌ గా కనిపించడంతో పాటు.. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ మెరిసింది. ఇక జాన్ అబ్రహం ఇందులో షారుఖ్ ని ఢీకొట్టే స్ట్రాంగ్ విలన్ గా కనిపిస్తున్నాడు.

ఓవరాల్ గా 'పఠాన్' టీజర్ చాలా స్టైలిష్ గా ఉంది.. ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ చూడబోతున్నామని హామీ ఇస్తోంది. ఇది మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ మూవీనే కాదు.. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాలా అనిపిస్తోంది. ఇది కచ్చితంగా కింగ్ ఖాన్ కు సాలిడ్ కంబ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదిత్య చోప్రా నిర్మించిన 'పఠాన్' చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ స్టోరీ మరియు దర్శకత్వం వహించగా.. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. విశాల్ - శేఖర్ సంగీతం సమకూర్చారు. సత్చిత్ పాల్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. 'పఠాన్' వచ్చే జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.