Begin typing your search above and press return to search.

పవన్ కు కథే అవసరం లేదన్నాడు.. ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశాడో..!

By:  Tupaki Desk   |   2 July 2021 8:35 AM GMT
పవన్ కు కథే అవసరం లేదన్నాడు.. ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశాడో..!
X
దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'బాహుబలి' సినిమాకు కథ అందించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారాయన. తెలుగుతో పాటుగా తమిళం కన్నడ హిందీ చిత్రాలకు కూడా స్టోరీలు అందిస్తూ పాన్ ఇండియా రైటర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తనయుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో పాటుగా 'తలైవి' 'సీత' వంటి చిత్రాలకు కథలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో చేయబోయే చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసి బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ రైటర్‌ అయిన విజయేంద్రప్రసాద్.. పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ను విజయేంద్ర ప్రసాద్ ఎంతగానో అభిమానిస్తారనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. 'బాహుబలి' చిత్రంలో ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం కూడా పవన్ క్రేజ్ ని ప్రేరణగా తీసుకొని రాసినట్లు రచయిత వెల్లడించారు. నిజానికి 'విక్రమార్కుడు' సినిమాని పవన్ తోనే రూపొందించాలని అప్పట్లో ప్రయత్నాలు చేశారని టాక్ ఉంది. హీరోకి కథ నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారట. అప్పటి నుంచి పవన్ తో సినిమా చేయాలని చూస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఓ స్క్రిప్ట్ రెడీ చేసి ఇటీవలే వినిపించారట. దీనికి హీరో సైడ్ ను నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

అయితే ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో అయితే చాలు.. కథ కూడా అవసరం లేదనే విధంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పవన్ మీద అభిమానంతో అగ్ర రచయిత ఎలాంటి స్టోరీ రెడీ చేసి ఉంటారో అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అలానే ఆ కథతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ధైర్యం చేస్తారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ముందుకు వచ్చినా ప్రస్తుతం పవన్ ఉన్న బిజీగా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే పవర్ స్టార్ ఆల్రెడీ రెండు చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్లి.. మరో మూడు సినిమాలను లోనే లో ఉంచారు. మరి రాబోయే రోజుల్లో బాహుబలి రచయిత కథతో పవన్ సినిమా చేస్తాడేమో చూడాలి.