Begin typing your search above and press return to search.

పవన్ పూర్తిగా మారిపోయాడండీ

By:  Tupaki Desk   |   25 Nov 2016 7:26 AM GMT
పవన్ పూర్తిగా మారిపోయాడండీ
X
అనుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వైఖరి. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ లేని మార్పు ఈ మధ్యన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందరికి దూరంగా తన మానాన తాను అన్నట్లుగా ఉండే ఆయన ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన తరచూ ప్రజల దృష్టికి వచ్చేలా చేస్తున్నారు.ఇప్పుడదే ఆసక్తికరంగా మారింది.

గతంలో పవన్ కు సంబంధించిన ఏ విషయమైనా చాలా గుట్టుగా ఉండేది. ఆయన ఎప్పుడూ ఎక్కడ ఎలా ఉంటున్నారన్న విషయం తెలిసేది కాదు. ఆయన సినిమా షూటింగ్ అంశాలు కూడా బయటకు పొక్కేవి కావు. ఇక.. సెట్ లో ఆయనేం చేస్తున్నారన్నది తెలిసేది కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసే వారు కాదు. అదేమంటే.. తనకు సిగ్గు ఎక్కువన్నట్లుగా ఆయన చెప్పేవారు.

అదేం మాయో కానీ.. ఈ మధ్యన పవన్ పూర్తిగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. తరచూ తనకు సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటుంటే.. ఆయన మాత్రం అవేమీ పట్టించుకోనట్లుగా వ్యవహరించే వారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆయన తీరు ఎలా ఉందంటే.. తన గురించి నలుగురు మాట్లాడుకోవాలి. తాను వార్తల్లో ఉండాలన్నట్లుగా ఆయన వైఖరి ఉంటోంది.

ఇటీవల కాలంలో చూస్తే.. ఆయన హాజరైన ఫంక్షన్లు చాలానే కనిపిస్తాయి. గతంలో కూడా పవన్ కు ఇన్విటేషన్లు వచ్చినా.. ఆయన హాజరు తక్కువగా ఉండేది. కానీ.. ఇప్పుడు మాత్రం ఎవరు ఆహ్వానించినా మర్యాదపూర్వకంగా వెళ్లటం కనిపిస్తుంది. సామాజికాంశాల విషయంలో తాను చురుగ్గా ఉన్నానన్న విషయాన్ని తెలిసేలా చేస్తున్న తీరు చూస్తే.. పవన్ చాలానే మారాడనిపించక మానదు. ఇంతకీ అంత మార్పు పవన్ లో ఎందుకబ్బా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/