Begin typing your search above and press return to search.

పవన్ జోక్యం చేసుకోక తప్పదా?

By:  Tupaki Desk   |   29 Aug 2017 8:22 AM GMT
పవన్ జోక్యం చేసుకోక తప్పదా?
X
ఏవైనా సినిమా వేడుకలు.. రాజకీయ సభల సమయంలో మినహాయిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులతో టచ్ లో ఉండడు. అభిమానులూ ఇలా ఉండండి.. అలా చేయండి.. ఇలా చేయొద్దు అని పవన్ ఎప్పుడూ చెప్పడు. సోషల్ మీడియాలోకి వచ్చినా కూడా అభిమానులతో కమ్యూనికేషన్ తక్కువే. ఐతే ఇప్పుడు పవన్ తన అభిమానుల్ని కొంచెం సంయమనం పాటించాలని పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ‘బిగ్ బాస్’ షోతో పాపులరైన క్రిటిక్ మహేష్ కత్తితో పవన్ అభిమానుల వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది.

ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్ గురించి అభిప్రాయం అడిగినపుడు మహేష్ కత్తి విమర్శనాత్మకంగా మాట్లాడటం.. ‘కాటమరాయుడు’ సినిమాకు కత్తి ఇచ్చిన రివ్యూ విషయంలో ఇప్పటికే కాకతో ఉన్న పవన్ అభిమానులు ఈ ఇంటర్వ్యూ చూసి మండిపోవడం.. ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం.. ఈ క్రమంలోనే కత్తి ఫోన్ నంబర్ వేలాది మంది పవన్ అభిమానులకు చేరి వాళ్లందరూ అతడికి నిర్విరామంగా కాల్స్ చేస్తుండటం.. వాట్సాప్ మెసేజులతో హోరెత్తించేయడం ఇలా గత రెండు మూడు రోజుల్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తనకు పవన్ అభిమానుల నుంచి ఎలా నిర్విరామంగా కాల్స్ వస్తున్నాయో.. తన ఫోన్ ఆన్ చేస్తే వరుసబెట్టి వస్తున్న కాల్స్ వల్ల తాను ఎలా ఇబ్బంది పడుతున్నానో.. తనను పవన్ అభిమానులు ఎలా తిట్టిపోస్తున్నారో చెబుతూ తన ఫేస్ బుక్ పేజీలో ఒక వీడియో పెట్టి వివరించాడు మహేష్ కత్తి. ఓ టీవీ ఛానెల్ చర్చ సందర్భంగా ‘‘నీ కొడుకు కూడా గుర్తు పట్టలేనట్లుగా నిన్ను చంపుతాం’’ అంటూ ఒక అభిమాని బెదిరించిన వీడియోను కూడా షేర్ చేశాడు కత్తి. మరోవైపు తనపై భౌతిక దాడులు జరగొచ్చని కూడా అతను ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు.. ఎవరి ఒప్పు అన్నది పక్కన పెడితే.. వెంటనే ఈ వివాదానికి తెర పడాల్సిన అవసరముంది. విపరీత పరిణామాలేవీ జరగకముందే దీనికి అడ్డుకట్ట వేయడం అవసరం. ఇప్పుడు పవన్ జోక్యం చేసుకుని అభిమానుల్ని నిలువరిస్తే తప్ప ఈ వివాదం సద్దుమణిగేలా లేదు. తమిళనాట అజిత్.. విజయ్ లాంటి స్టార్లు కూడా ఇలాగే అభిమానులకు పిలుపు ఇచ్చాక కూడా వాళ్లు తగ్గలేదు. కాబట్టి పవన్ కూడా ఇక్కడ అలాంటి ప్రకటన ఒకటి ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.