Begin typing your search above and press return to search.

పవన్ డ్రస్సులకే 90 లక్షలు

By:  Tupaki Desk   |   15 Jan 2018 4:27 AM GMT
ఇప్పటికి అందరిని తీవ్రమైన ఆలోచనలో పడేస్తున్న విషయం ఒకటుంది. అజ్ఞాతవాసి రిజల్ట్ ఏంటనేది కాసేపు పక్కన పెడితే అసలు ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీకి అంత బడ్జెట్ ఎలా అయ్యిందా అని. ప్రభుత్వాన్ని కోరి మరీ టికెట్లను అధిక ధరకు అమ్ముకోవడానికి అనుమతి తెచ్చినప్పుడు కూడా ఇదే సందేహం అందరిని వెంటాడింది. గతంలో కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల విషయంలో ఇలాంటి ప్రయత్నాలు ఏమి జరగలేదు. ఇప్పుడు అజ్ఞాతవాసి ఫలితం తేడాగా రావడంతో ఖర్చుకు సంబంధించిన ఒక్కొక్క వార్త బయటికి వస్తోంది. తాజాగా తెలిసిన సమాచారం మేరకు ఇందులో పవన్ వాడిన దుస్తులకు అక్షరాల 90 లక్షల రూపాయలు అయ్యిందనే గాసిప్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. పవన్ ఇందులో స్టైలిష్ గా చాలా క్లాసీ కాస్ట్యూమ్స్ తో కనిపించింది నిజమే అయినప్పటికీ విదేశాల నుండి ప్రత్యేకంగా తెప్పించి మరీ వాడేంత సీన్ ఉన్నావా అంటే ఔను అని వెంటనే చెప్పలేని పరిస్థితి.

దీనికి తోడు అజ్ఞాతవాసికి పవన్ డ్రెస్ కర్టసీ ఇచ్చిన ప్రముఖ ఫిలిం సిటీలోని ఆర్ట్ డిపార్టుమెంటుకు 5.5 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి అనే మరో న్యూస్ కూడా షాక్ కు గురి చేస్తోంది. అంటే వేసుకునే బట్టలకే రెండు మీడియం బడ్జెట్ సినిమాలు తీసేంత ఖర్చు అయ్యిందన్న మాట. ఇవి అఫీషియల్ న్యూస్ కాదు కాని ప్రస్తుతం ఫిలిం నగర్లో దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఇలా ఓవర్ ది బోర్డు బడ్జెట్ పెట్టుకుంటూ పోవడం వల్లే పరిస్థితి దారి తప్పి అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే కాపీ వివాదం, డిజాస్టర్ టాక్, నష్టాల భయంతో అజ్ఞాతవాసి సతమతమవుతూ ఉంటె మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇలాంటివి వాటిని ఇంకాస్త పెద్దవి చేస్తున్నాయి.