Begin typing your search above and press return to search.

పవన్ ప్రచారాలు పని చేయట్లేదే..

By:  Tupaki Desk   |   28 May 2018 11:30 PM GMT
పవన్ ప్రచారాలు పని చేయట్లేదే..
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్నే సరిగా ప్రమోట్ చేసుకోడు. అలాంటిది ఈ మధ్య వరుసగా బయటి సినిమాలకు పవన్ ప్రచారాలు చేసి పెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే వాటి వెనుక అసలు కారణాలు వేరు అని తర్వాత తర్వాత జనాలకు తెలిసిస్తోంది. ఆబ్లిగేషన్ల వల్ల వస్తున్నప్పటికీ పవన్ రాక మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి పవన్ చేస్తున్న ఈ ప్రచారాలు ఆయా సినిమాలకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయని అడిగితే మాత్రం సంతృప్తికర సమాధానం రావట్లేదు.

మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లతో ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి చేయలేకపోయినందుకు గాను ‘రంగస్థలం’ స్పెషల్ షో చూసి దాని సక్సెస్ మీట్ కు అతిథిగా వెళ్లాడు పవన్. కానీ అప్పటికే చాలా లేటైంది. ‘రంగస్థలం’ మేజర్ షేర్ అప్పటికే రాబట్టేసింది. పవన్ కొత్తగా వచ్చి దానికి సాయం చేసిందేమీ లేదు. అది అంతకుముందు లాగా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తూ వెళ్లింది.

ఇక నాగబాబు కోసమని ‘నా పేరు సూర్య’ థ్యాంక్స్ మీట్ కు వెళ్లాడు పవన్. కానీ దాని వల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. ఆ చిత్ర వసూళ్లలో మార్పు కనిపించలేదు. అది ఊహించని విధంగా డిజాస్టర్ అనిపించుకుంది. ఇక తాజాగా పవన్ తన మిత్రుడు.. జనసేనకు ఫండింగ్ కూడా చేస్తున్నట్లుగా కూడా భావిస్తున్న రామ్ తాళ్ళూరి నిర్మాణంలో తెరకెక్కిన ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు వెళ్లాడు. కానీ ఆ సినిమాకు కూడా పవన్ ఏమీ కలిసి రాలేదు. ఆ చిత్రానికి ఏమాత్రం హైప్ లేకపోయింది. రవితేజ కెరీర్లోనే తక్కువ ప్రి రిలీజ్ బజ్ తో ఆ చిత్రం రిలీజైంది. ఇక దాని టాక్.. వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తంగా పవన్ తన పొలిటికల్ కమిట్మెంట్లను కూడా పక్కన పెట్టి సినిమాలకు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన ఫలితాలైతే ఉండట్లేదు.