Begin typing your search above and press return to search.

ఎచీవ్‌ చేసేవాళ్లకైతే పవన్‌ వస్తాడు

By:  Tupaki Desk   |   1 July 2015 5:30 PM GMT
ఎచీవ్‌ చేసేవాళ్లకైతే పవన్‌ వస్తాడు
X
పవన్‌ ఆలోచనల్లో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అందుకే అతడి పేరు మీదే పవనిజం పాపులర్‌ అయ్యింది. వ్యవస్థ బావుండాలి. నేతల పాలన బావుండాలి. పేదరికం నుంచి ప్రజలు బైటపడాలి.. అన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉంది. అంతేకాదు.. కింది స్థాయినుంచి కష్టించి పైకి ఎదిగేవాళ్లంటే అతడికి విపరీతమైన అభిమానం. అలాంటివాళ్లు ఎదురుపడితే తప్పకుండా పలకరించి చిరునవ్వులు చిందిస్తాడు. అందుకు ఓ రెండు ఉదాహరణలు చెప్పాలి.

అప్పట్లో ఏ.ఆర్‌.రెహమాన్‌ 'పులి' పాటల ఆవిష్కరణ వేడుకకు హైదరాబాద్‌ వచ్చాడు. ఆరోజు ఆడియో వేదికపై పవన్‌ మాట్లాడిన తీరు ప్రేక్షకులు, అహూతుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. రెహమాన్‌లా కష్టపడి కింది స్థాయి నుంచి ఎదిగిన సంగీత దర్శకులు మనకు ఉండడం గర్వకారణం. ఆస్కార్‌ అందుకున్న దిగ్గజం. ఒకప్పుడు మన కోటి దగ్గర పనిచేశాడు.. అని పవన్‌ ఆరోజు ఎంతో ఉద్వేగంగా మాట్టాడాడు. అంతేనా నిరంతరం సంగీత సాధనలో లీనమై, చిత్తశుద్ధితో పనిచేసే సంగీత దర్శకుడని కొనియాడాడు. ఆ తర్వాత మళ్లీ పవన్‌ పొగడ్తకి అర్హమైన వేరొక వ్యక్తి కనిపించనేలేదు.

ఇక ఇన్నాళ్లికి రామోజీరావు రూపంలో ఒకరు పవన్‌కి కనిపించారు. ఇది యాథృచ్ఛికమే అయినా పవన్‌ మనసులోని అంతరంగాన్ని ఇటీవలే ఈటీవీ 20 వసంతాల వేడుకలో ఆవిష్కరించాడు. మీడియా రంగంలో రామోజీ ఎదిగిన తీర ఇన్‌స్పిరేషన్‌ కలిగిస్తుంది. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదగడానికి ఎంతో శ్రమించారాయన. బహిరంగ వేడుకలకు రావడం అసౌకర్యం అనిపిస్తుంది. కానీ వచ్చానంటే అందుకు కారణం రామోజీగారు.. అంటూ మనసులోని మాటను బైటికి చెప్పాడు. మద్రాసులో సితార అవార్డ్స్‌ ప్రారంభించినప్పుడు వారిచ్చిన తొలి బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును అన్నయ్య అందుకున్నారు. అప్పట్నుంచి రామోజీగారు సుపరిచితం. మీడియా రంగంలో అన్నివిధాలా అందరికీ ఆదర్శం ఆయన.. అంటూ పవన్‌ ప్రశంసించాడు.

కదిలించే గొప్ప వ్యక్తులు అయితేనే వారి సభలకు రావడానికి పవన్‌ మొహమాట పడడు. మనసుతో వచ్చి మెచ్చుకుని వెళతాడన్నమాట! ఇలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉంది కనుకే జనసేన నేతగా పాపులారిటీ పెంచుకుంటున్నాడు. రాజకీయాల్లో అన్నను మించిన తమ్ముడు అనిపించుకుంటున్నాడు.