Begin typing your search above and press return to search.

కె.విశ్వ‌నాథ్‌ తో త‌న రిలేష‌న్ చెప్పిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   30 April 2017 6:41 AM GMT
కె.విశ్వ‌నాథ్‌ తో త‌న రిలేష‌న్ చెప్పిన ప‌వ‌న్‌
X
తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు.. ప‌వ‌న్ క‌ల్యాణ్. మ‌రి.. అలాంటి ఆయ‌న న‌టించిన మొద‌టిసినిమా అన్న వెంట‌నే అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి అని చెప్పేస్తారు. ఆలోచించి చెప్ప‌మ‌న్నా.. అదేన‌ని మ‌రికాస్త గ‌ట్టిగా చెబుతారు. ఇక‌పై.. అలా చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ తెలీని ఒక కొత్త విష‌యాన్ని వెల్ల‌డించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అంతేకాదు.. త‌నకు తొలి సినిమా ఛాన్స్ ఇచ్చింది కె.విశ్వ‌నాథ్ సినిమాలోనే అంటూ ఆయ‌న చెప్పారు.

విశిష్ఠ ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్ కు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అత్యుత్త‌మ పుర‌స్కార‌మైన దాదాపాల్కే అవార్డు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. ఆయ‌న్ను క‌లిసేందుకు వెళ్లారు పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు తివిక్ర‌మ్ శ్రీనివాస్‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి వెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. కె.విశ్వ‌నాథ్‌ పై త‌న‌కున్న అపార ప్రేమాభిమానాల్ని త‌న మాట‌ల‌తో చెప్పి అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌న‌కు న‌ట‌న రాద‌ని.. అందుకే కె. విశ్వ‌నాథ్ సినిమాల్లో న‌టించ‌లేదంటూ త‌న‌లోని లోపాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పేసిన ప‌వ‌న్ తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

ఇదిలా ఉంటే.. విశ్వ‌నాథ్‌ కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాల్ని ప‌వ‌న్‌.. తివిక్ర‌మ్‌ తో మాట్లాడించిందో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌. ఈ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కె.విశ్వ‌నాథ్‌ తో త‌న‌కున్న రిలేష‌న్‌ ను వెల్ల‌డించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఒక సంద‌ర్భంలో త‌న మొద‌టి చిత్రం కె.విశ్వ‌నాథ్‌ తోనేన‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు. అదెలా అన్న‌ది చెప్పారు.

అంద‌రూ త‌న తొలి సినిమా అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి అనుకుంటార‌ని.. అది కాదంటూ త‌న చిన్న‌ప్పుడు జ‌రిగిన గ‌మ్మ‌త్తైన ముచ్చ‌ట‌ను చెబుతూ.. మ‌ద్రాసు టీ న‌గ‌ర్ లో పోరూరు సోమ‌సుంద‌రం స్ట్రీట్ లో మా అన్న వాళ్లు ఉండేవారు. దానికి ఎదురుగా న‌టి విజ‌య‌నిర్మ‌ల ఇల్లు ఉండేది. ఆ సందులోనే వారి డ‌బ్బింగ్ థియేట‌ర్ ఉండేది. ఒక రోజు అందులో అన్న‌య్య విశ్వ‌నాథ్ గారితో తొలిసారి చేస్తున్న శుభ‌లేఖ డ‌బ్బింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

స్కూల్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. అన్న‌య్య‌కు టీ ఇవ్వ‌టానికి డ‌బ్బింగ్ థియేట‌ర్‌ కు వెళ్లా. అప్ప‌ట్లో నా వ‌య‌సు ప‌ద‌హారేళ్ల వ‌ర‌కూ ఉంటాయి. ఆ సినిమాలో అన్న‌య్య‌ది స‌ర్వ‌ర్ గా ప‌ని చేసే పాత్ర‌. హోట‌ల్ సీన్‌ లో వెనుక ర‌క‌ర‌కాల చిన్న చిన్న పాత్ర‌లు మాట్లాడుతుంటాయి. న‌న్ను చూసి.. చిత్ర నిర్మాత వి.వి.శాస్త్రి ఈ డ‌బ్బింగ్ చెప్ప‌రా అంటూ ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు. మంచినీళ్లు ఎక్క‌డ సార్ అనే ఓ చిన్న డైలాగ్ ఇచ్చారు. నేను చెప్పేశా. ఇప్ప‌టికి ఆసీన్లో నా గొంతు సినిమాలో వినిపిస్తుంది. అదే సినీ రంగంలోకి నా మొద‌టి ఎంట్రీ.. ఒక ర‌కంగా చెప్పాలంటే విశ్వ‌నాథ్ గారి సినిమాతో నా సినీ రంగ ప్ర‌వేశం జ‌రిగిపోయింద‌ని చెప్పొచ్చంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాన్ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/