Begin typing your search above and press return to search.

నో చెప్పేసిన పవర్ స్టార్?

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:26 AM GMT
నో చెప్పేసిన పవర్ స్టార్?
X
జనసేనతో పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ తనకు ఇకపై సినిమాలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాని అజ్ఞాతవాసి చేదు ఫలితం తాలూకు కష్టనష్టాలు మాత్రం నిర్మాతను - డిస్ట్రిబ్యూటర్లను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. లెక్కలు పూర్తిగా బయటికి చెప్పడం లేదు కాని ట్రేడ్ నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నష్టం దాదాపు 70 కోట్ల దాకా ఉందని చెబుతున్నారు. కొంత వెనక్కు ఇచ్చేందుకు ఏదో ఒప్పందం జరిగింది అని టాక్ వచ్చింది కాని దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక అజ్ఞాతవాసి నుంచి కోలుకునేలా తమ బ్యానర్ లో మరో సినిమా చేయమని నిర్మాత రాధాకృష్ణ నుంచి ఒక విన్నపం పవన్ దాకా వెళ్లిందట. ఒకవేళ రిజల్ట్ తేడా వస్తే ఎలా అనే ముందు ఆలోచనతో గతంలోనే అడిగారట. కాని పవన్ మాత్రం ఇకపై సినిమాలు చేయలేను అని నిస్సహాయ స్థితిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

పవన్ కు రెమ్యునరేషన్ రూపంలో 20 కోట్లతో పాటు వచ్చే లాభాల్లో 10 శాతం ఇవ్వాలనే ఒప్పందం జరిగినట్టు గతంలోనే టాక్ బలంగా వినిపించింది. పవన్ మాత్రం కొంత మొత్తం వెనక్కు ఇవ్వడం గురించి, మరో సినిమా చేయడం గురించి స్పష్టంగా లేదు అని చెప్పినట్టు తాజా సమాచారం. ఇది కాకుండా పవన్ లాస్ట్ ఇయర్ ఎఎం రత్నంకు ఒక సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని కూడా డ్రాప్ అవ్వాలని పవన్ డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. నీసన్ - సంతోష్ శ్రీనివాస్ ఈ ఇద్దరు దర్శకులు పవన్ సినిమా చేస్తామనే ఇన్ని రోజులు వెయిట్ చేసారు. కాని అది జరిగే పని కాదని తేలిపోయింది.

హారికా అండ్ హాసిని బ్యానర్ వద్ద అక్షయ్ కుమార్ లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ జాలీ ఎలెల్బి రీమేక్ హక్కులు ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో తక్కువ టైంలో పూర్తి చేసే అవకాశం ఉన్న స్క్రిప్ట్ అది. ఇది పవన్ తో చేద్దామని అడిగితే పవన్ నో చెప్పేసాడు కాబట్టి వెంకటేష్ తో ఇదే సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు పూర్తయ్యి ప్రభుత్వం ఏర్పడే దాకా పవన్ ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి స్పష్టత వచ్చే అవకాశం లేదు. సో అప్పటి దాకా పవర్ స్టార్ సినిమా కబుర్లు ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు