Begin typing your search above and press return to search.

20 ఏళ్ళైనా పవన్ పై అదే ప్రేమ

By:  Tupaki Desk   |   29 Jan 2019 10:34 AM GMT
20 ఏళ్ళైనా పవన్ పై అదే ప్రేమ
X
కొన్ని సినిమాలకు టైం ఫ్రేమ్ తో సంబంధం లేదు. ఎప్పుడు ఎన్నిసార్లు విడుదలైనా టీవీలో వచ్చినా ఆదరణ విషయంలో ఏ మాత్రం మార్పు ఉండదు. అందుకే వాటికి క్లాసిక్స్ అనే పేరు పడిపోతుంది. జెనెరేషన్ తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరిని అలరించడమే వీటి ప్రత్యేకత. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ తొలిప్రేమది ప్రత్యేక స్థానం. 1998లో ఓ మోస్తరు అంచనాలతో దర్శకుడు కరుణాకరన్ డెబ్యూ మూవీగా విడుదలైన ఈ ఎపిక్ లవ్ స్టొరీ 200 రోజులు పైగా సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. కలెక్షన్లు లెక్కేసి ట్రేడ్ అలిసిపోయింది.

అప్పటి యూత్ ఎన్నిసార్లు ఈ సినిమా చూశారంటే లెక్క తేల్చడం కష్టం. సిస్టర్ సెంటిమెంట్-లవ్-ఫ్రెండ్ షిప్-ఎమోషన్స్-ఫ్యామిలీ అన్ని సమపాళ్లలో కుదిరిన తొలిప్రేమ లాంటి మాస్టర్ పీస్ కరుణాకరణే మళ్ళి తీయలేకపోయాడు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారా. మొన్న ఆదివారం స్టార్ మాలో మొదటిసారి పవన్ తొలిప్రేమ ప్రీమియర్ వేశారు. అంతే అభిమానులు సినిమా ప్రేమికులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో హాష్ ట్యాగులతో వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

అయితే ఇక్కడ మరో విశేషం ఉంది. తొలిప్రేమ టీవీలో రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో జెమినీలో లెక్కలేనన్ని సార్లు వేశారు. తర్వాత జీ ఛానల్ లో కొంతకాలం వచ్చింది. చేతులు మారి హక్కులు ఇప్పుడు స్టార్ మాకు వచ్చాయి. మంచి క్వాలిటీతో స్టార్ మా చేసిన టెలికాస్ట్ ని అందరూ ఒక పండగలా జరుపుకోవడం విశేషం. ప్రసారం అవుతున్న సమయంలో ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నవాళ్ళు ఎందరో. ఇలా ఒక సినిమా 20 ఏళ్ళ తర్వాత కూడా అంతే క్రేజ్ ని సొంతం చేసుకోవడం అంటే అంత కన్నా ఘనత ఏముంటుంది. అన్నట్టు యుట్యూబ్ లో 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఈ తొలిప్రేమ అఫీషియల్ గా అందుబాటులో ఉన్నా టీవీ ప్రసారాన్ని ఇలా వైరల్ చేయడం విశేషమే.