Begin typing your search above and press return to search.

పవన్ బాబాయ్ రావాలని

By:  Tupaki Desk   |   20 Jan 2018 6:15 AM GMT
పవన్ బాబాయ్ రావాలని
X
తొలిప్రేమ అనే టైటిల్ తో మెగా ఫాన్స్ కు ఎమోషనల్ గా పెద్ద కనెక్షనే ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అల్ టైం బెస్ట్ క్లాసిక్ లవ్ స్టొరీగా మిగిలిపోవడమే కాదు వసూళ్ళ పరంగా కూడా అప్పుడు ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసి మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోయింది ఆ మూవీ. బాలుగా పవన్ పాత్ర ప్రభావం కొద్ది రోజుల పాటు యూత్ పై అలా నిలిచిపోయింది. మళ్ళి ఇన్నాళ్ళ తర్వాత వరుణ్ తేజ్ అదే పేరుతో ఓ సినిమాతో ముందుకు వస్తుండటంతో ఇది కూడా ఆ స్థాయిలో ఉంటుంది అనే అంచనాలు పెట్టేసుకుంటున్నారు అభిమానులు.

ఈ రోజు సాయంత్రం తొలిప్రేమ ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగనుంది. అతిధిగా ఎవరు వస్తారో బయటికి చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా తెలిసిన సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అయితే వెళ్లిందట. వచ్చేది లేనిది మాత్రం ఇంకా ఖరారు చేయలేదని, ముందే బయటికి చెప్పేస్తే పవన్ వస్తాడనే అంచనాలతో ఫాన్స్ వస్తారు కాబట్టి సస్పెన్స్ కొనసాగిస్తున్నట్టు తెలిసింది.

ఈ మధ్య కాలంలో తనవి తప్ప పవన్ ఏ మెగా హీరో ఫంక్షన్ కి వెళ్ళలేదు. ఖైది నెంబర్ 150 ఓపెనింగ్, సైరా పోస్టర్ రిలీజ్ లకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. అలాంటప్పుడు వరుణ్ ఫంక్షన్ కి వస్తాడా అనే అనుమానం రావడం సహజం. కాని తొలిప్రేమ తన కెరీర్ లో మర్చిపోలేని మైల్ స్టోన్ మూవీ కాబట్టి అందులోనూ అన్నయ్య నాగబాబు కొడుకే నటిస్తున్నాడు కాబట్టి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని అంటున్న వారు కూడా ఉన్నారు,

పవన్ వ్యక్తిగతంగా వరుణ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యింది ముకుందా ఓపెనింగ్ టైంలోనే. అది కుడా మెరుపులా అలా కనిపించి ఇలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ మాత్రం వచ్చినా చాలు అని ఫ్యాన్స్ చూస్తున్నారు. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ తొలిప్రేమకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో పవన్ తొలిప్రేమకు దేవా సంగీతం అందిస్తే ఇప్పుడు వరుణ్ తొలిప్రేమకు తమన్ ట్యూన్స్ ఇస్తున్నాడు. మరి పవన్ రాక ఉంటుందో లేదో సాయంత్రం జరగబోతున్న తొలిప్రేమ వేడుకలో తేలిపోనుంది.