Begin typing your search above and press return to search.

సుందరానికి కొత్త టెన్ష‌న్! పవ‌న్ రాక అందుకేనా!

By:  Tupaki Desk   |   9 Jun 2022 4:30 AM GMT
సుందరానికి కొత్త టెన్ష‌న్! పవ‌న్ రాక అందుకేనా!
X
అంటే సుంద‌రానికి అంటూ హీరో నాని ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ నెల తొమ్మిదిన ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. వేడుకల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ రానున్నారు. దీంతో ఈ వేడుకకు ఇప్పుడు ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది. నిన్న‌టిదాకా రాని క్రేజ్ ఒక్క‌సారిగా వ‌చ్చింది. ప‌వ‌న్ వ‌చ్చాక రాజ‌కీయంగా ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో అన్న ఆందోళ‌న ఇండస్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. మ‌రోవైపు ప‌వ‌న్ రాక నేప‌థ్యంలో నాని సినిమాకు మెగా అభిమానులు మ‌ద్ద‌తుగా ఉంటున్నారు. ఈ సినిమా విజ‌యం కాంక్షిస్తూ, నాని కి అండ‌గా నిలుస్తున్నారు. మ‌రి! ఈ వేడుక‌ల్లో నాని ఏమ‌యినా కాంట్రవ‌ర్శీ చేస్తారా? ప‌వ‌న్ ఏమ‌యినా రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తారా ?

టికెట్ రేట్ల విష‌య‌మై అప్ప‌ట్లో నాని చేసిన కొన్ని కామెంట్లు పెను దుమారం రేపాయి. శ్యామ్ సింగ‌రాయ్ స‌మయంలో నాని చేసిన వ్యాఖ్య‌లు వివాదం అయ్యాయి. అప్ప‌ట్లో టికెట్ రేట్లు త‌క్కువ‌గా ఉండ‌డంతో కిళ్లీ కొట్టు ఆదాయం క‌న్నా థియేట‌ర్ రేటు గ‌ణ‌నీయంగా త‌క్కువ‌గా ఉంటోంద‌ని, ఈ స‌మ‌యంలో థియేట‌ర్లు న‌డ‌ప‌డం క‌ష్ట‌మేన‌ని నాని ఆవేద‌న చెందాడు.

ఆ త‌రువాత త‌న వ్యాఖ్య‌లకు వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు. ఇదే స‌మ‌యంలో పవ‌న్ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల్చారు. నాని వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే థియేట‌ర్ల‌పై ఏపీ స‌ర్కారు దాడులు చేయించి ప‌లు చోట్ల ఆ రోజు శ్యామ్ సింగ‌రాయ్ న‌డ‌వ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. ఎలా చూసినా సినిమా ఘోర ప‌రాజ‌యం అయింది. కానీ ప‌వ‌న్ మాత్రం ఈ చిన్న హీరోకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు తావిచ్చింది.

తాజాగా ప‌వ‌న్ రావ‌డంతో సినిమాకు సంబంధించి మాట్లాడి వెళ్తారో లేదా ఏపీ స‌ర్కారుపై మ‌ళ్లీ వ్యాఖ్య‌లు చేస్తారో అన్న ఉత్సుక‌త లేదా ఉద్విగ్న‌త అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఇటు సినిమా వ‌ర్గాల్లోనూ నెల‌కొని ఉంది. అందుకే.. ప‌వ‌న్ ఏం మాట్లాడినా కూడా కాస్త ఆచితూచి మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే చిరు తో స‌హా ప‌లువురు హీరోలు టికెట్ రేట్ల పెంపుపై ఆ రోజు జ‌గ‌న్ తో మాట్లాడి వ‌చ్చారు. ఆ త‌రువాతే పెద్ద సినిమాలు విడుద‌ల‌యి., కాస్తో కూస్తో అనుకున్న‌విధంగా టికెట్ రేట్ల‌ను పెంచుకుని తాము పెట్టిన డ‌బ్బులు తిరిగి వ‌చ్చే విధంగా ప‌లు ప్ర‌య‌త్నాలు చేశాయి.

సీఎం జ‌గ‌న్ ను క‌లిసి వ‌చ్చాక ట్రిపుల్ ఆర్ మంచి రేంజ్ స‌క్సెస్ అందుకుంది. కానీ మ‌హేశ్ సినిమా స‌ర్కారు వారి పాట కానీ, ప్ర‌భాస్ రాధే శ్యామ్ కానీ చిరు ఆచార్య కానీ ఆశించిన ఫ‌లితాలు అందుకోలేక‌పోయాయి. దీంతో మ‌ళ్లీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పున‌రాలోచ‌న‌లో ప‌డి మేజ‌ర్, ఎఫ్ 3 వంటి సినిమా విష‌యంలో రేట్లు త‌గ్గించాయి. దాంతో కొంతలో కొంత ఇవి సేఫ్ జోన్లో ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో ఆర్థికంగా అనేక ఒడిదొడుకుల్లో ఉన్న ఇండ‌స్ట్రీకి ఇప్పుడిప్పుడే కొన్ని పరిణామాలు ప్ర‌భుత్వ ప‌రంగా కాస్త సానుకూలంగా ఉన్నాయి.

ఇప్పుడేమ‌యినా ప‌వ‌న్ పాత గాయాలు త‌వ్వాడో వివాదం మ‌ళ్లీ మొద‌టికే వచ్చే ప్ర‌మాదం ఉంది. క‌నుక ప‌వ‌న్ ఏమి మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఆరోజు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా కాదు బిడ్డ‌గా వెళ్లి మాట్లాడిన వారిలో చిరు ముఖ్యులు.. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని అంటే సుంద‌రానికి ప్రీ రిలీజ్ లో మాట్లాడితే మేలు. ప‌వ‌న్ సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌నంత వ‌ర‌కూ ఇండ‌స్ట్రీ కూడా సేఫ్ ! ఆ పాటి ప‌రిణితితో ప‌వ‌న్ మెలిగితే చాలు అని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.