Begin typing your search above and press return to search.

నా సినిమాలను ఆపేది ఎవరు? చూస్తూ ఊరుకుంటామా?: పవన్

By:  Tupaki Desk   |   26 Sep 2021 7:30 AM GMT
నా సినిమాలను ఆపేది ఎవరు? చూస్తూ ఊరుకుంటామా?: పవన్
X
'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కల్యాణ్, ఆ సినిమా గురించి మాత్రమే కాకుండా, చిత్రపరిశ్రమ నేడు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను గురించి మాట్లాడారు. అదే సమయంలో ఇటీవల నానికి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. " పాపం ఈ మధ్యన హీరో నానీ గారిని కొంతమంది తెగ తిడుతూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది. ఆయన అక్రమాలు .. అన్యాయాలు ఏమీ చేయలేదు. తను హీరోగా ఒక సినిమా చేసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ కి వెళ్లాలనుకున్నాడు.

ఒక వైపున థియేటర్లు క్లోజ్ అయ్యాయి .. గత్యంతరం లేక ఆయన ఓటీటీ వైపు వెళ్లాడు. అప్పుడు థియేటర్ల యజమానులంతా ఆ అబ్బాయి మీద పడితే ఆయన ఏం చేస్తాడు? వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి మీద పడటం వలన ప్రయోజనం ఏముంటుంది? ఇందులో ఆ అబ్బాయి తప్పేమి ఉంది? ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కల్లోనే లక్షమందికి పైగా సినిమాపై ఆధారపడి ఉన్నారు. పవన్ కల్యాణ్ పై మీరు అక్కడ సినిమాలు ఆపేసి, లక్షమంది పొట్టకొడుతున్నారు ఇక్కడ.

ఒకవేళ నాతో మీకు గొడవ ఉంటే నా సినిమాలను ఆపేయండి ఫరవాలేదు .. మా వాళ్ల సినిమాలను మాత్రం వదిలేయండి. ఈ మధ్య నాతో కొంతమంది అన్నారు .. ఎందుకండీ చిరంజీవి గారు వాళ్లని అంతలా బతిమాలుకుంటారని. ఆయనది చాలా మంచి మనసయ్యా .. అందుకని అలా బతిమాలుకుంటాడు అన్నాను. అప్పడు అక్కడ ఎవరో మినిష్టర్ కూడా ఉన్నాడు .. పేరు మర్చిపోయాను అనగానే, జనంలో నుంచి ఆ మంత్రి పేరు వినిపించింది .. వెంటనే పవన్ మళ్లీ స్పందిస్తూ .. "ఆ .. ఆ .. ఆ సన్నాసే .. ఆ సన్నాసి పేరు గుర్తుకు రాలేదు నాకు.

ఆ సన్నాసి ఏమన్నాడంటే 'మా నాయకులకి చిరంజీవిగారంటే సోదర భావన .. వారికి కూడా మేమంటే సోదర భావన' అన్నాడు. సోదర భావన .. సోదర భావన ఏంటి .. సోదిలో సోదర భావన. ఉపయోగపడని సోదర భావన .. చిత్ర పరిశ్రమకి అక్కరకురాని సోదర భావన దేనికి? దిబ్బలో కొట్టడానికా? ఆ సన్నాసికి చెప్పండి .. పవన్ సినిమాలు ఆపేసి చిత్రపరిశ్రమను వదిలియమని. అన్నా మన సినిమాల పరిస్థితి ఏమిటి? అని మీరు అడగొచ్చు. మనల్ని ఎవర్రా ఆపేది అక్కడ? వాళ్లు ఆపితే చూస్తూ కూర్చుంటామా? అంటూ పవన్ అలా తనదైన స్టైల్లో తెగించి మాట్లాడటంతో ఫ్యాన్స్ ఈలలతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది.