Begin typing your search above and press return to search.

డిజాస్టర్ సినిమాకు ఓటీటీలో పే పర్ వ్యూ ఏంటండీ బాబూ..!

By:  Tupaki Desk   |   31 May 2022 8:49 AM GMT
డిజాస్టర్ సినిమాకు ఓటీటీలో పే పర్ వ్యూ ఏంటండీ బాబూ..!
X
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో నటించిన "సన్ ఆఫ్ ఇండియా" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. టాక్ ఎలా ఉన్నా ఓ మోస్తరు వసూళ్ళు వస్తాయని అందరూ భావించారు. కానీ కలెక్షన్ కింగ్ సినిమా మినిమమ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఇది సోషల్ మీడియాలో నెటిజన్లకు ట్రోలింగ్ స్టఫ్ గా మిగిలిపోయింది.

థియేటర్లలో ప్రేక్షకాదరణకు నోచుకోని 'సన్నాఫ్ ఇండియా' చిత్రాన్ని ఇటీవలే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి పెట్టారు. భారతీయ ప్రేక్షకులు సాధారణ సబ్స్క్రిప్షన్ తో ఈ సినిమాని చూడవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా ప్రైమ్ యూఎస్ లో మాత్రం పే ఫర్ వ్యూ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

అమెరికాలో 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని నార్మల్ సబ్స్క్రిప్షన్ తో చూడటానికి అవకాశం లేదు. వినియోగదారులు ఆ సినిమా చూడాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం రెంట్ గా అయితే 3 డాలర్లు.. సినిమాని కొనాలంటే 10 డాలర్లు అదనంగా వసూలు చేస్తున్నారు.

సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేదా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు కూడా ఇలా జరగదు. వినియోగదారులందరికీ మామూలు సబ్ స్క్రిప్షన్ తోనే అందుబాటులో ఉంచుతారు. కానీ ప్రైమ్ వీడియో మాత్రం 'కేజీఎఫ్ 2' రేంజ్ లో 'సన్నాఫ్ ఇండియా' చిత్రాన్ని పే పర్ వ్యూ ప్రాతిపదికన విడుదల చేయడానికి సాహసించడం విచిత్రంగా ఉంది.

కొన్ని సినిమాలు థియేటర్లో ప్లాప్ అయినా.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. అయితే 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి భారతదేశంలో ఓటీటీలోనూ ఆదరణ దక్కలేదని తెలుస్తోంది. సినిమాపై వచ్చిన నెగివిటీ ఓటీటీ రిలీజ్ లోనూ కొనసాగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

అలాంటి చిత్రాన్ని యూఏస్ జనాల కోసం రెంట్ టు వాచ్ మోడల్ లో స్ట్రీమింగ్ చేసి కొత్త ట్రోల్స్ కు ప్రైమ్ వీడియో తగినంత స్కోప్ ఇచ్చిందనే చెప్పాలి. నిజానికి 'సన్నాఫ్ ఇండియా' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తెరకెక్కించారు. కానీ చివరకు థియేటర్లలో విడుదల చేసారు.

దేశభక్తి నేపథ్యంలో సాగే సన్నాఫ్ ఇండియా చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే అందించారు. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజ సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ - మీనా - ప్రజ్ఞా జైస్వాల్ - అలీ - తనికెళ్ల భరణి తదితరులు ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు.