Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ పై కాస్త దృష్టి పెట్టండయ్యా..!

By:  Tupaki Desk   |   14 July 2022 10:30 AM GMT
ప్రమోషన్స్ పై కాస్త దృష్టి పెట్టండయ్యా..!
X
ఓటీటీలకు అలవాటు పడిపోయి థియేటర్లకు జనాలను రప్పించడం అనేది ఈరోజుల్లో మేకర్స్ పెద్ద టాస్క్ గా మారింది. దీని కోసం ఇంతక ముందు కంటే ఎక్కువగా పబ్లిసిటీ చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ చేసి.. టీవీ యాడ్స్ ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు.

ఎలాంటి సినిమా అయినా రిలీజ్ వరకూ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో సందడి చేస్తూనే ఉండాలి. ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ - మేకింగ్ వీడియోలు.. అంటూ రెగ్యులర్ అప్డేట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటేనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగలరు. అలా చేస్తేనే జనాలు థియేటర్ల వరకూ వస్తున్నారు.

RRR వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్ఎస్ రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో కలిసి దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు చుట్టి రావడమే కాదు.. ఓవర్ సీస్ లోనూ ప్రమోట్ చేశారు. 'విక్రమ్' సినిమా కోసం ఈ వయసులోనూ విశ్వ నటుడు కమల్ హాసన్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు.

'కేజీఎఫ్ 2' కోసం చిత్ర బృందం ఎంతగా ప్రచార కార్యక్రమాలు చేశారో చూశాం. 'మేజర్' సినిమాని హీరో అడివి శేష్ మరియు నిర్మాత మహేష్ బాబు కలిసి ప్రచారంతోనే జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. 'చార్లీ 777' కోసం ఒక డాగ్ ని తీసుకెళ్లి ప్రమోట్ చేశారు. ఇంతలా పబ్లిసిటీ చేశారు కాబట్టే ఆ సినిమాలు జనాల దృష్టిని ఆకర్షించగలిగాయి.

పెద్దగా ప్రమోషన్స్ చేయని చిత్రాలను ప్రేక్షకులు కూడా అలానే లైట్ తీసుకున్నారనేది ఇటీవల కొన్ని సినిమాల ఓపెనింగ్స్ ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు.. నెల రోజుల ముందు నుంచే తమ చిత్రాన్ని ప్రమోట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దగా ప్రచారం చేయని ఫిలిం మేకర్స్ ను.. ఆ హీరో అభిమానులు నిలదీస్తున్నారు.

యువసామ్రాట్ నాగచైతన్య నటించిన 'థాంక్యూ' ప్రమోషన్స్ దూకుడుగా లేవని నిర్మాత దిల్ రాజు ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అక్కినేని అభిమానులు ప్రశ్నించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా స్పీడ్ పెంచడం లేదని నిలదీసారు. ఈ సినిమాకు కథ-మాటలు అందించిన బీవీఎస్ రవి ఈ విషయాన్ని వేదికపై ప్రస్తావించారంటే అర్థం చేసుకోవచ్చు.

'థాంక్యూ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రైటర్ రవి మాట్లాడుతూ.. "రాజు గారు తక్కువ మాట్లాడు.. తక్కువ మాట్లాడు అంటున్నారు. అసలే మీరంతా పబ్లిసిటీ తక్కువగా ఉందని గొడవ చేస్తున్నారు. ఇక్కడ కూడా తక్కువ మాట్లాడటం కరెక్టా?" అని ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

"అసలు ఈ సినిమాకు పబ్లిసిటీ ఉందా? ఈ సినిమాకు పబ్లిసిటీ లేదనే విషయాన్నే పబ్లిసిటీ చేయండి. అప్పుడైనా సినిమాకు వస్తుంది" అని రవి పేర్కొన్నారు. దీంతో దిల్ రాజు మైక్ అందుకుని 'రవీ.. మన సినిమా చాలా పాజిటివ్. నెగెటివ్ వైబ్స్ ఎందుకు?' అని అన్నాడు. 'నాగార్జున ఫ్యాన్స్ అంటేనే పాజిటివ్ సర్ అని రవి సమాధానమిచ్చారు.

ఏదైతేనేం ప్రమోషన్స్ లేవని సోషల్ మీడియాలో గోల చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్.. ఈ విషయం మీద దిల్ రాజు ని నిలదీశారు. దీంతో పబ్లిసిటీ కోసం ఏమేం ప్లాన్ చేశారో చెప్పి వారిలో ఉత్సాహం తీసుకొచ్చారు స్టార్ ప్రొడ్యూసర్. 'జోష్' తర్వాత నాగచైతన్య తో చాలా ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న రాజు.. ఈసారి సాలిడ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో 'థాంక్యూ' చిత్రాన్ని ఏవిధంగా జనాల్లోకి తీసుకెళ్లి బజ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇక మాస్ మహారాజా రవితేజ తన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని ప్రమోట్ చేయడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. చిత్ర బృందం ఏదొక అప్డేట్ తో వస్తున్నా.. హీరో రవితేజ మాత్రం ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా చిన్నదైనా పెద్దదైనా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజుల్లో పబ్లిసిటీ చాలా కీలకం. ఈ విషయాన్ని దర్శక హీరోలు నిర్మాతలు దృష్టిలో పెట్టుకుంటేనే థియేటర్లలో టికెట్లు తెగుతాయనేది స్పష్టంగా తెలుస్తుంది.