Begin typing your search above and press return to search.

‘పెళ్లిచూపులు’పై సురేష్ బాబు లెక్క తప్పింది

By:  Tupaki Desk   |   1 Aug 2016 1:30 PM GMT
‘పెళ్లిచూపులు’పై సురేష్ బాబు లెక్క తప్పింది
X
కొన్ని సినిమాల ఫలితాల్ని అంచనా వేయడం కష్టం. ‘బిచ్చగాడు’ అనే పేరుతో ఓ సినిమా వస్తుంటే చాలా చీప్ గా చూశారు జనాలు. కానీ ఆ సినిమా పాతిక కోట్లకు పైగా కొల్లగొట్టి.. వందకు పైగా థియేటర్లలో శత దినోత్సవం దిశగా దూసుకెళ్తోంది. అలాగని మంచి సినిమాలన్నీ ఆడేస్తాయనేం లేదు. కొన్ని సినిమాలకు అలా కలిసొచ్చేస్తూ ఉంటుందంతే. గత శుక్రవారం విడుదలైన ‘పెళ్లిచూపులు’లో విషయం ఉందని చాలా ముందే పసిగట్టారు అగ్ర నిర్మాత సురేష్ బాబు. ఈ సినిమాకు తన వంతుగా చాలా తోడ్పాటు అందించారు. ముందే ప్రివ్యూలు వేయించి ఇండస్ట్రీ జనాలకు.. మీడియా వాళ్లకు సినిమా గురించి తెలిసేలా చేశారు. దీంతో విడుదలకు కొన్ని రోజుల ముందే సినిమాకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఐతే ఎంత పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండదేమో అని.. మల్టీప్లెక్సుల్లో మినహా సింగిల్ స్క్రీన్లలో గొప్ప కలెక్షన్లేమీ ఉండవని భావించారు సురేష్ బాబు. అందుకే సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి హడావుడి చేయట్లేదని.. పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే సురేష్ బాబుతో పాటు ‘పెళ్లిచూపులు’ నిర్మాతకు కూడా దిమ్మదిరిగిపోతోంది. ఓ పక్క రివ్యూలు.. మరోపక్క మౌత్ టాక్.. ఇంకో పక్క సోషల్ మీడియాలో ప్రచారం ఫుల్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వస్తున్నాయి.

మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. నిన్న ఆదివారం హైదరాబాద్ లో చాలా వరకు థియేటర్లు నిండిపోయాయి. మల్టీప్లెక్సులన్నీ విడుదల రోజు కేటాయించిన స్క్రీన్లను రెండో రోజు నుంచి డబుల్ చేశాయి. సింగిల్ స్క్రీన్లు కూడా పెంచక తప్పని పరిస్థితి తలెత్తుతోంది. దగ్గర్లో ఉన్న థియేటర్లలో సినిమా లేదని సామాన్య ప్రేక్షకులు ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి ‘పెళ్లిచూపులు’ విషయంలో సురేష్ బాబు అంచనా తప్పిందనే చెప్పాలి. ‘జక్కన్న’ కలెక్షన్లు ఆల్రెడీ డ్రాప్ అయ్యాయి.. ‘కబాలి’ పూర్తిగా డల్ అయిపోయింది. కాబట్టి వెంటనే స్క్రీన్లు పెంచితే ‘పెళ్లిచూపులు’కు బాగా కలిసొచ్చే అవకాశముంది.