Begin typing your search above and press return to search.

రోలెక్స్ కి ప‌ర్ ఫెక్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్!

By:  Tupaki Desk   |   23 July 2022 9:41 AM GMT
రోలెక్స్ కి ప‌ర్ ఫెక్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్!
X
విభిన్న‌మైన సినిమాల‌కు, ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌. ఆయ‌న స్ఫూర్తితో త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో కెరీర్ ని ప్రారంబించిన‌ హీరో సూర్య. జూలై 23 ఆయ‌న పుట్టిన రోజు. 2020 ఇయ‌ర్ కి గానూ ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్‌ని బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గన్ తో క‌లిసి అవార్డుకి ఎంపిక కావ‌డంతో హీరో సూర్య పుట్టిన రోజున ల‌భించిన ప‌ర్ ఫెక్ట్ గిఫ్ట్ గా ప‌లువురు సెల‌బ్రిటీలు అభివ‌ర్ణిస్తున్నారు. సుధా కొండ‌ర తెర‌కెక్కించిన 'సూరారై పోట్రు' మూవీకి గానూ సూర్య ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు. సూర్య అసలు పేరు శ‌ర‌వ‌ణన్‌ శివ‌కుమార్‌. ప్ర‌ముఖ న‌టుడు శివ‌కుమార్ న‌ట‌వార‌సుడిగా సినీరంగ ప్ర‌వేశం చేశారు.

1997లో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా వ‌సంత్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ డ్రామా 'నేరుక్కు నేర్‌' సినిమాతో త‌న సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. అయితే ఇండ‌స్ట్రీలో వున్న నెపొటిజ‌మ్ గురించి తెలుసుకున్న సూర్య సినిమాల్లోకి ప్ర‌వేశించ‌డానికి ముందు తండ్రి, న‌డుటు శివ‌కుమార్ త‌న‌యుడిగా చెప్పుకునేవాడు కాద‌ట‌. చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేసేవార‌ట‌. అలా సినిమాల్లోకి ప్ర‌వేశించ‌డానికి ముందు ఎనిమిది నెల‌ల పాటు సూర్య గ్రార్మెంట్ కంప‌నీలో ప‌నిచేయ‌డం విశేషం.

ఆ త‌రువాతే దిగ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్ పై నిర్మించిన 'నేరుక్కు నేర్‌' సినిమాతో సూర్య త‌న కెరీర్ ని ప్రారంభించారు. ఇందులో మెయిన్ హీరోగా విజ‌య్ న‌టించారు. ఈ మూవీ స‌క్సెస్ కావ‌డంతో ఇక సూర్య వెనుదిరిగి చూసుకోలేదు. సోలో హీరోగా 'కాద‌లే నిమ్మ‌ది', సంధిప్పోమ‌ వంటి చిత్రాల్లో న‌టించాడు. అయితే బాల తెర‌కెక్కించిన 'నందా' సినిమా సూర్య‌కు హీరోగా, న‌టుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అమీర్ 'మౌనం పేసియ‌దే', గౌత‌మ్ మీన‌న్ 'కాఖకాఖ‌' సూర్య‌ని తిరుగు లేని స్టార్ ని చేశాయి.

ఇక 2005లో ఏ.ఆర్‌. మురుగ‌దాస్ డైరెక్ట్ చేసిన 'గ‌జిని' సూర్య కెరీర్ ని మ‌రో మ‌లుపు తిప్పింది. తెలుగులో సూర్య‌కు మంచి మార్కెట్ ని క్రియేట్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసింది. అప్ప‌టి నుంచే హీరో సూర్య త‌మిళంతో పాటు తెలుగుపై ప్ర‌త్యేక దృష్టిని పెట్ట‌డం మొద‌లు పెట్టాడు. త‌ను న‌టించిన ప్ర‌తి సినిమాని త‌మిళంతో పాటు ఒకేసారి తెలుగులోనూ విడుద‌ల చేయ‌డం మొద‌లు పెట్టాడు. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ ని ఓ ప్ర‌యోగంగా భావించి విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరో గా స‌రికొత్త గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.

తాజాగా త‌న 38వ చిత్రం 'సూరారైపోట్రు'తో ఉత్త‌మ న‌టుడిగా జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నాడు. సుధా కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్ గా న‌టించింది. 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై స్వ‌యంగా హీరో సూర్య న‌టించి నిర్మించారు. ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ స్ఫూర్తితో ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మంచారు. ఈ సినిమాకు ముందు వ‌రుస ఫ్లాపుల్లో వున్నారు సూర్య‌. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ కోసం చిన్నపాటి య‌జ్ఞ‌మే చేశార‌ని చెప్పొచ్చు.

సినిమా రిలీజ్ టైమ్ లో థియేట‌ర్ల పెద్ద‌గా రీ ఓపెన్ కాలేదు. సినిమా రెడీగా వుంది. దీంతో డైరెక్ట్ ఓటీటీకే ఇచ్చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే సూర్య నిర్ణ‌యాన్ని ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. సూర్య త‌న నిర్ణ‌యాన్ని పునః ప‌రిశీలించుకోక‌పోతే త‌న సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌మని, బ్యాన్ చేస్తామంటూ హెచ్చ‌రించారు. త‌న‌పై ఎంత వ్య‌తిరేక‌త ఎదురైనా సూర్య గ‌ట్టి న‌మ్మ‌కంతో 'సురారైపోట్రు'ని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశాడు.

డైరెక్ట్ ఓటీటీలో విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన సూర్య న‌మ్మ‌కాన్ని నిజం చేసింది. అ మూవీలోని కొన్ని స‌న్నివేశాల్లో సూర్య ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. తండ్రి చ‌నిపోయిన వార్త తెలిసిన సంద‌ర్భంలో ఫ్లైట్ టికెట్ కోసం డ‌బ్బులు స‌రిపోక‌పోవ‌డంతో తోటి ప్ర‌యాణికుల‌ని టికెట్ డ‌బ్బుల కోసం సూర్య అడుక్కునే స‌న్నివేశం ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలించింది. అంతే కాకుండా త‌ను క‌న్న క‌ల కోసం త‌పించే క్ర‌మంలో మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు గురయ్యే వంటి స‌న్నివేశాలే ఇప్ప‌డు సూర్య‌కు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ పుర‌స్కారాన్ని అందించాయి. సూర్య ప‌డిన శ్ర‌మ‌కు ద‌క్కిన ప్ర‌తిఫ‌లంగా ఈ అవార్డుని ప్ర‌ముఖులు అభివ‌ర్ణిస్తున్నారు. అంతే కాకుండా సూర్య పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఉత్త‌మ నటుడి అవార్డుతో పాటు మ‌రో నాలుగు పుర‌స్కారాలు ఈ మూవీకి ల‌భించ‌డంతో సూర్య‌కు ప‌ర్ ఫెక్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్ ల‌భించింద‌ని ప్ర‌ర‌శంసిస్తున్నారు.

ఇక రీసెంట్ గా క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'విక్ర‌మ్‌'. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో సూర్య కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో రోలెక్స్ గా న‌టించి అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. సినిమా చివ‌ర్లో హీరో సూర్య క‌నిపించేది కేవ‌లం ఐదు నిమిషాలే అయినా త‌న‌దైన న‌ట‌న‌తో స్పెల్ బౌండ్ పెర్ఫార్మెన్స్ తో అద‌గొట్టాడ‌ని, విక్ర‌మ్ మూవీకి సూర్య పోషించిన 'రోలెక్స్‌' క్యారెక్ట‌ర్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం విశేషం.

-ర‌వి గోరంట్ల‌