Begin typing your search above and press return to search.

'పాపం.. దిల్ రాజుకు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా ముళ్ల మీద కూర్చున్నట్లే'

By:  Tupaki Desk   |   29 Sep 2021 2:47 PM GMT
పాపం.. దిల్ రాజుకు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా ముళ్ల మీద కూర్చున్నట్లే
X
ఏపీ ప్రభుత్వం వెర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న వ్యవహారంలో ఇప్పుడు నిర్మాత దిల్ రాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పవన్ ఇటీవ‌ల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మరియు మంత్రులపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ''వకీల్ సాబ్ అంటూ ఎందుకండీ నాతో సినిమా తీశారు.. మీరు నాతో సినిమా తీయకుండా ఉండి ఉంటే ఈపాటికి ఆంధ్రాలో సినిమాలు విడుదలయ్యుండేవి. మీరు రెడ్డి.. వాళ్లు రెడ్డి.. రెడ్డీ రెడ్డి తేల్చుకోండి.. చెప్పండి దిల్ రాజు గారు రెడ్డి అని.. అప్పుడు జగన్ రెడ్డికి మజా వస్తుంది. మమ్మల్ని బ్రతికించండి'' అని వెటకారంగా మాట్లాడారు. ఆ మాటలకు హరీష్ శంకర్ చప్పట్లు కొడుతుండగా.. దిల్‌ రాజ్ ప‌డి ప‌డి న‌వ్వుతూ క‌నిపించారు.

పవన్ కళ్యాణ్ సభలో వ్యాఖ్యలకు ప్రత్యక్ష సాక్షి అయిన దిల్ రాజు.. ఇప్పుడు పవన్ ను ఏపీ మినిస్టర్ పేర్ని నాని విమర్శిస్తున్న సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు. ఈరోజు మ‌చిలీప‌ట్నంలో మంత్రి నివాసంలో నిర్మాతలు దిల్‌ రాజు - డీవీవీ దాన‌య్య‌ - సునీల్ నారంగ్‌ -  బ‌న్నీ వాసు - మైత్రీ నవీన్ - వంశీ  తదితరులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకే నిర్మాతలు వచ్చారని పేర్ని నాని తెలిపారు. సినీ ప్రముఖుల సమక్షంలోనే 'సన్నాసి' 'సన్నాసిన్నర వెదవ' వ్యాఖ్యల గురించి మంత్రి మాట్లాడారు. ''సందర్భాన్ని సమయాన్ని బట్టి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని వాళ్ళని రిక్వెస్ట్ చేసాను.. ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే తెలియజెప్పండి.. మేము స్పందించకపోతే గట్టిగా అడగండి. ఎవరైనా అవాస్తవలని ఆపాదించే ప్రయత్నం చేసినప్పుడు.. వాస్తవాలను చెప్పకపోతే అది ఇండస్ట్రీ అభిప్రాయం అని సమాజం అనుకుంటుంది. కాబట్టి ఫిలిం ఛాంబర్ తరపున వాస్తవాలను చెప్పండి అని రిక్వెస్ట్ చేసాను'' అని పేర్ని నాని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని.. దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని అన్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా దిల్ రాజును ఉద్దేశిస్తూ.. 'ఆ నా కొ*కు ఎదురుగా కూర్చోపెట్టి తిట్టాడు.. ఈ నా కొడుకు పక్కన కూర్చోబెట్టి తిడుతున్నాడు అని పక్కకి వెళ్లి తిట్టుకుంటాడు.. పాపం ఆయనకు అక్కడికి వెళ్ళినా ముళ్ల మీద కూర్చున్నట్లే ఉంటది.. ఇక్కడికి వచ్చినా ముళ్ల మీద కూర్చున్నట్లే ఉంటది' అని మంత్రి నవ్వుతూ అన్నారు. దీనికి దిల్ రాజు కూడా నవ్వుతూ కనిపించారు. పవన్ వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో సంబంధిత మంత్రితో నిర్మాత‌ల భేటీ సానుకూల వాతావ‌ర‌ణాన్ని ఏర్పరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.