Begin typing your search above and press return to search.

సూర్య ఈసారైనా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాలి

By:  Tupaki Desk   |   13 Feb 2020 2:52 PM GMT
సూర్య ఈసారైనా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాలి
X
సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశం నీ హద్దురా`. అపర్ణ బాలమురళి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వెంక‌టేష్ హీరోగా న‌టించిన `గురు` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్.. పైలెట్ జీ.ఆర్‌. గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇంత‌కుముందు రిలీజైన‌ టీజర్ ఆక‌ట్టుకుంది. సూర్య‌ ఇంటెన్స్ న‌ట‌న‌తో పాటు.. ఈ చిత్రంలో మోహన్ బాబు రోల్ ఆస‌క్తిని రేకెత్తిస్తాయ‌ని తెలుస్తోంది. ఒక సాధార‌ణ పైలెట్ ఎయిర్ డెక్క‌న్ విమాన‌యాన కంపెనీ అధినేత‌గా ఎదిగే క్ర‌మంలో ఎదురైన ఛాలెంజెస్ ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఈ సినిమాకి జీవీ ప్ర‌కాష్ ఆర్.ఆర్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.

తాజాగా ఈ సినిమా నుంచి `పిల్లా పులి` అంటూ సాగే పాట నిమిషం వీడియో విడుదలైంది. ఈ పాట ఆద్యంతం సూర్య - అప‌ర్ణ బాల‌ముర‌ళి మ‌ధ్య రొమాన్స్ ఓ రేంజులో పండింది. ఈ పాట‌లో ప్రేమ భావ‌న‌ల‌కు సంబంధించిన అంద‌మైన విజువల్స్ ఆక‌ట్టుకున్నాయి. ఇక చాలావరకు స్లో మోషన్ షాట్స్ పాట ఆద్యంతం క‌నిపించాయి. సూర్య .. త‌న ప్రియురాలు అపర్ణ బాలమురళి మధ్య అనుబంధానికి సంబంధించిన బాణీ ఇది. జీ.వి.ప్రకాష్ స్వరపరిచిన ట్యూన్ మెలోడియ‌స్ గా ఆక‌ట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం అస్సెట్‌. అనురాగ్ కులకర్ణి గాత్రం మైమ‌రిపిస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్త‌యింది. వేసవిలో సినిమాని విడుదల చేయనున్నారు. గ‌త కొంత‌కాలంగా సూర్యకు వ‌రుస ఫ్లాప్ లతో ఒడిదుడుకుల‌ కెరీర్ ఇబ్బందిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. స‌రైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో బ‌యోపిక్ తో అభిమానుల ముందుకు వ‌స్తున్నాడు. మంచి రిజ‌ల్ట్ ద‌క్కుతుంద‌నే ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.