Begin typing your search above and press return to search.

పైరసీ మార్కెట్ కుదేలైంది

By:  Tupaki Desk   |   11 Aug 2016 10:10 AM GMT
పైరసీ మార్కెట్ కుదేలైంది
X
పైరసీ.. ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమల్ని దెబ్బ తీస్తున్న రక్కసి. ఇంటర్నెట్ విస్తృతి పెరిగాక ఈ భూతం మరింత ప్రమాదకరంగా తయారైంది. పైరసీ ప్రింట్ బయటికి రావడం ఆలస్యం.. ఇంటర్నెట్లోకి వచ్చేయడం.. లక్షలు కోట్ల మందికి చేరిపోతుండటంతో అన్ని పరిశ్రమల వాళ్లూ కోట్లల్లో నష్టపోతున్నారు. ఈ పైరసీ చూసేవాళ్లందరూ థియేటర్లకు వస్తారనేమీ లేదు కానీ.. దీని వల్ల థియేటర్లకు వచ్చేవాళ్లు కూడా ఆగిపోతారన్నది వాస్తవం.

ఐతే పైరసీని అరికట్టే విషయంలో ప్రభుత్వాలు అంత సీరియస్ గా లేకపోవడం వల్ల ఏమీ చేయలేక ఫిల్మ్ మేకర్స్ సైలెంటుగా ఉంటున్నారు. పైరసీ వల్ల దెబ్బ తిన్నవాళ్లు ఆయా సమయాల్లో కాస్త గొంతు చించుకోవడం తప్ప సినీ పరిశ్రమల్లోనూ పైరసీపై పోరాడే విషయంలో ఐకమత్యం లేకపోయింది. ప్రభుత్వాల మీద అంతగా ఒత్తిడి తేకపోవడం వల్ల పైరసీ మరింత విస్తరిస్తూ ఉంది. ఐతే ఈ మధ్య అన్ని ఇండస్ట్రీల వాళ్లలోనూ కొంచెం కదలిక రావడంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దీంతో పైరసీ సినిమాలకు కేంద్రాలైన కొన్ని వెబ్ సైట్లపై చర్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళ సినిమాలు విడుదలైన సాయంత్రానికే నెట్లో పెట్టేసే కొన్ని ఫేమస్ వెబ్ సైట్లన్నీ బంద్ అయిపోయాయి. ఈ సైట్లలో తెలుగు-హిందీ సినిమాలు కూడా దొరుకుతాయి.

మరోవైపు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ పైరసీ వెబ్ సైట్లతో పాటు టొరెంట్లను పెట్టే సైట్లకు కూడా పంచ్ పడింది. పైరసీ వెబ్ సైట్లకు ఒక వారధిలాగా నిలిచే ‘టొరెంట్జ్’ను.. కిక్ యాస్ట్ టొరెంట్ వెబ్ సైట్ ను ఆపేయడంతో పైరసీ మార్కెట్ బాగా దెబ్బ తింది. దీంతో లోకల్ సినిమాలే కాక ఇంటర్నేషనల్ సినిమాలు కూడా దొరక్క పైరసీ ప్రియులు అల్లాడిపోతున్నారు. పైరసీ విషయంలో సీరియస్ గా స్పందిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి ఈ పరిణామాలే రుజువు. ఇలాగే టైట్ చేస్తే మున్ముందు పైరసీని బాగానే అడ్డుకోవచ్చు.