Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మహిళల సమస్యలను బోల్డ్ గా చర్చిస్తున్న 'పిట్టకథలు'

By:  Tupaki Desk   |   5 Feb 2021 5:07 AM GMT
ట్రైలర్ టాక్: మహిళల సమస్యలను బోల్డ్ గా చర్చిస్తున్న పిట్టకథలు
X
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ "పిట్టకథలు'' రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి నలుగురు దర్శకులు కలిసి ఈ కథా సంకలనాన్ని రూపొందించారు. టాలెంటెడ్ డైరెక్టర్స్ నాగ్‌ అశ్విన్‌ - బి.వి.నందిని రెడ్డి - తరుణ్ భాస్కర్‌ - సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ఈషా రెబ్బా - సాన్వే మేఘన - అమలా పాల్‌ - శృతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఈ తెలుగు ఆంథాలజీని అధికారికంగా ప్రకటించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 19న 'పిట్టకథలు' విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఆంథాలజీ ట్రైలర్ ని వదిలారు.

శాన్వీ మేఘన ప్రధాన పాత్రలో నటించిన 'రాముల' అనే కథకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. జగపతిబాబు - అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మీరా' స్టోరీని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. శృతి హాసన్ లీడ్ రోల్ లో రూపొందిన 'ఎక్స్ లైఫ్' కథకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈషా రెబ్బా - సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింకీ' విభాగానికి సంజల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 'పిట్ట కథలు' ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్ లో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలు బోల్డ్ గా చర్చించినట్లు అర్థం అవుతోంది.

భిన్నమైన సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమాలో మహిళా సాధికారతను, వారు ఎదుర్కొనే సమస్యల్ని చూపించబోతున్నారు. మానవ సంబంధాల్ని సహజంగా కొత్త కోణంలో చూపిస్తున్న 'పిట్ట కథలు' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇది హిందీ 'లస్ట్ స్టోరీస్' తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆంథాలజీలో మంచు లక్ష్మి - అషిమా నర్వాల్‌ - సత్యదేవ్‌ - సంజిత్‌ హెగ్దే ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్.ఎస్.వి.పి మూవీస్ మరియు ఫ్లయింగ్‌ యునికార్న్‌ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రోనీ స్క్రూవాలా - ఆశిదువా ఈ సిరీస్ ని నిర్మించారు. 'పిట్టకథలు' సంకలనం 190 దేశాలలో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ ప్లిక్స్‌ ప్రకటించింది.