Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని ప్ర‌శంస‌లు పొందిన `ది క‌శ్మీర్‌ ఫైల్స్` టీమ్‌

By:  Tupaki Desk   |   13 March 2022 3:40 AM GMT
ప్ర‌ధాని ప్ర‌శంస‌లు పొందిన `ది క‌శ్మీర్‌ ఫైల్స్` టీమ్‌
X
సామాజిక అంశాల నేప‌థ్యంలో సినిమాల్ని తెరకెక్కిస్తూ ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు వివేక్ అగ్ని హోత్రి. ఆయ‌న రూపొందించిన సంచ‌ల‌న చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్‌`. బాలీవుడ్ పాపుల‌ర్ యాక్ట‌ర్స్ అనుప‌మ్ ఖేర్‌, మిధున్ చ‌క్ర‌వ‌ర్తి , ప‌ల్ల‌వి జోషి, ద‌ర్శ‌న్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

జీ స్టూడియోస్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ తేజ్ నారాయ‌ణ్ అగ‌ర్వాల్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, ప‌ల్ల‌వి జోషి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దేశ వ్యాప్తంగా మార్చి 11న విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్ర బృందానికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

1990లో క‌శ్మీర్ లో ఓ సామాజిక వ‌ర్గం పై జ‌రిగిన దారుణ మార‌ణ కాండ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సున్నిత‌మైన భావోద్వేగాల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంపై డే వ‌న్ నుంచి విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు, ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

క‌శ్మీర్‌లో జ‌రిగిన దారుణ మార‌ణ కాండ‌ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చారు ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల చెప్పుకొచ్చారు కూడా.

ఎంతో సున్నిత‌మైన అంశం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించ‌డం అంత సులువైన విష‌యం కాదు. ఈ సినిమా ఎంతో మందికి క‌నువిప్పు క‌లిగిస్తుంది. భార‌త చ‌రిత్ర‌లో జ‌రిగిన ఘోర‌మైన ఘ‌ట్టాల‌ని వాస్త‌వికంగా తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాను. ప్ర‌తీ ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టిస్తుంది అని ద‌ర్శ‌కుడు వివేక్ అగ్ని హోత్రి తెలిపారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఎన్నో వ్య‌వ‌ప్ర‌యాస‌ల‌తో పాటు అనేక స‌వాళ్ల‌ని అధిగ‌మించి ఈ చిత్రాన్ని విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చిన మేక‌ర్స్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

సాక్ష్యాత్తు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా పిలిచి అభినందించారు. నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్, న‌టి, నిర్మాత ప‌ల్ల‌వి జోషీ, ద‌ర్శ‌కుడు వివేక్ అగ్ని హోత్రిల‌ని ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని మోదీ అభినందించ‌డం విశేషం. అంతే కాకుండా ఈ సంద‌ర్భంగా తెలుగు నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ ప్ర‌ధానిని ప్ర‌త్యేకంగా శాలువాతో స‌త్క‌రించి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.