Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్ : ప్ర‌ధాని మోదీ బ‌యోపిక్

By:  Tupaki Desk   |   21 March 2019 4:09 AM GMT
ట్రైల‌ర్ టాక్ : ప్ర‌ధాని మోదీ బ‌యోపిక్
X
దేశాన్ని కాపాడుకోవ‌డం అంటే అంత సులువా? ఓవైపు దాయాది పాకిస్తాన్ కుట్ర‌లు.. మ‌రోవైపు అంత‌ర్గ‌తంగా కుట్ర‌ల్ని ఎదుర్కోవాలి. ప్రతిప‌క్షాలు - కులాలు - మ‌తాలు ఒక‌టేమిటి అన్నీ కుట్ర‌లు కుతంత్రాలే. అలాంటి చోట‌ న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ముందుకు వెళ్ల‌గ‌లిగేవాడు మాత్ర‌మే ఆ ప‌ని చేయ‌గ‌ల‌డు. ముఖ్యంగా హిందూ దేశంలో పుట్టి ఆర్.ఎస్.ఎస్‌- హిందూత్వ భావ‌జాలాన్ని న‌ర‌న‌రాన జీర్ణించుకున్న వాడు అయితేనే దేశాన్ని కాపాడ‌గ‌ల‌డు. గుండెల నిండా ద‌మ్ము- ధైర్యం .. అంత‌కుమించి దేశ‌భ‌క్తి ఉన్న వాడు దేశానికి నాయ‌కుడు అయితేనే అన్ని స‌మ‌స్య‌ల‌కు సొల్యూష‌న్. స‌రిగ్గా అలాంటి నాయ‌కుడు మ‌న‌కు దొరికాడు. అతడే న‌రేంద్ర మోదీ. అత‌డి సాహ‌సాలు ఎలాంటివి? స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు మోదీ నిర్ణ‌యాల ప‌నిత‌నం ఎలా ఉంటుంది? అన్న‌ది తెలియాలంటే న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ చూడాల్సిందే.

తాజాగా రిలీజైన పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ ట్రైల‌ర్ సారాంశం ఇదే. గ‌డ్డ క‌ట్టే చ‌లిలో మంచులో భార‌త‌దేశ మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌ల్ని కాపాడేందుకు మోదీ చేసిన సాహ‌సం.. ఆర్.ఎస్.ఎస్ శిక్ష‌ణ‌.. హిందూత్వ వంటి అంశాలు ఎమోష‌న్ ని ర‌గిలిస్తున్నాయి ఈ ట్రైల‌ర్ లో. దేశం కోస‌మే మోదీ ఏం చేసినా.. అత‌డి శ్వాస చివ‌రివ‌ర‌కూ దేశం కోస‌మే. త‌ల్లిదండ్రుల్ని - భార్య‌ను వ‌దిలేసాడ‌ని శ‌త్రువులంతా తూల‌నాడుతుంటారు. అయితే అది సిద్ధాంతానికి సంబంధించిన ఘ‌ర్ష‌ణ‌. ఉద్ధేశ‌పూర్వ‌కంగా ఏదీ ఉండ‌దు.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వ‌స్తుంది.

ఏప్రిల్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఎన్నిక‌ల ముందే అంటే ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మేర‌కు ద‌ర్శ‌కుడు ఒమంగ్ కుమార్ - నిర్మాత లు ఎస్.సింగ్ - ఆనంద్ పండిట్ - సురేష్ ఒబేరాయ్ కొత్త తేదీ నిర్ణ‌యించామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఏప్రిల్ 11 వ‌ర‌కూ ఎన్నిక‌ల కోడ్ వ‌ర్తిస్తుంది కాబ‌ట్టి మోదీ బ‌యోపిక్ సాఫీగా రిలీజ‌వుతుందా లేదా? అన్న‌ది చూడాలి. గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ మ‌ర‌ణం వ‌ల్ల రెండో పోస్టర్ విడుద‌ల‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్ట‌ర్ల‌ను క‌థానాయ‌కుడు ఒబేరాయ్ రిలీజ్ చేశారు. వాటికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మోదీ బ‌యోపిక్ ట్రైల‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అన్న‌ట్టు ఈ చిత్రాన్ని దేశంలోని 23 భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. చెప్పిన టైమ్ ప్ర‌కారం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే సందేహ‌మే. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ప‌ని చేస్తేనే ఇది వ‌ర్క‌వుట‌వుతుంది.