Begin typing your search above and press return to search.
మహేష్ ఫ్యాన్స్ కి పోలండ్ బుజ్జి పంచ్
By: Tupaki Desk | 2 April 2018 2:03 PM GMTసినిమాల్లో సెంటిమెంట్స్ ను బాగానే ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే. కానీ ఇవి మరీ నేలబారుగా ఉంటే.. పిల్లకాయలతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల పరిస్థితి అలాగే తయారైంది. వేరే హీరోకి కౌంటర్ ఇద్దామని స్టార్ట్ చేసి.. చివరకు ఎక్కడో 6వేల కిలోమీటర్ల దూరంలో పోలండ్ లో ఉన్న బుడతతో క్లాస్ పీకించుకునే సిట్యుయేషన్ తెచ్చుకున్నారు.
పోలండ్ కుర్రాడు జిబిగ్స్ బుజ్జికి.. తెలుగు పాటలు అంటే తెగ ఇష్టం. భాష రాకపోయినా మాంచి పాటలు ఎంచుకుని తెగ పాడేస్తుంటాడు. అజ్ఞాతవాసి పాటలు పాడి బాగా ఫేమస్ అయినా.. అంతకు ముందు ఆ తరువాత కూడా చాలానే సాంగులు సింగేశాడు ఈ పోలండ్ బుజ్జి. ఇప్పుడీ బుడతడిని.. భరత్ అనే నేను పాటలు మాత్రం పాడద్దంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మెసేజ్ లు పెడుతున్నారట. దీనికి సమాధానం ఇచ్చాడు జిబిగ్స్ బుజ్జి.
'భరత్ అనే నేను సినిమా నుంచి పాటలు పాడద్దంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మెసేజ్ లు పెడుతున్నారు. నేను పాడితే సినిమా డిజాస్టర్ అవుతుందని చెబుతున్నారు. అవునా.. నేను ఎంత సక్కుగున్నావే పాటను పాడాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బాగున్న సినిమా మాత్రమే ఆడుతుంది. నేను పాడడం ఆ సినిమాపై ప్రభావం చూపదు.. నాకు నచ్చిన ఏ పాటను అయినా సరే నేను పాడతాను' అని తెగేసి చెప్పాడు ఈ బుజ్జి.
అంతే కాదు.. ఫ్యాన్స్ వార్స్ ఆపండి అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ సందేశం కూడా ఇచ్చాడు. ఈ పిల్లాడు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఆ విషయం మహేష్ ఫ్యాన్స్ కూ తెలుసు. కానీ అజ్ఞాతవాసిని ఇంకా ట్రాలింగ్ చేద్దామని ట్రై చేసి.. చివరకు ఫట్ మనిపించేలా అడిగి మరీ ఎదురు కొట్టించుకున్నట్లుగా ఉంది వాలకం.