Begin typing your search above and press return to search.

నిర్మాత నట్టికుమార్ కొడుకు మీద పోలీసుల దాడి

By:  Tupaki Desk   |   1 Jan 2020 4:37 AM GMT
నిర్మాత నట్టికుమార్ కొడుకు మీద పోలీసుల దాడి
X
సమస్య ఏదైనా సరే.. డయల్ 100కు ఫోన్ చేయండి. క్షణాల్లో వస్తాం.. మీ సమస్యను తీరుస్తామంటూ భారీ ప్రచారం చేయటం తెలిసిందే. దీంతో.. తమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం డయల్ 100కు ఫోన్ చేయటం తెలిసిందే. ఇటీవల జీడిమెట్లకు చెందిన ఒకరు అర్థరాత్రి వేళ.. ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని డయల్ 00కు ఫోన్ చేస్తే.. అర్థరాత్రి నిద్ర పోనివ్వకుండా ఫోన్ చేస్తావా? అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి మీద సదరు పోలీసు దాడి చేయటం తెలిసిందే.

తాజాగా అలాంటి సీనే డిసెంబరు 31న రాత్రి రిపీట్ అయ్యింది. నిర్మాత నట్టి కుమార్ కుమారుడిపైన పోలీసులు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. బేగంపేట కంట్రీక్లబ్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. డిసెంబరు 31 అర్థరాత్రి కంట్రీ క్లబ్ వద్ద చోటు చేసుకున్న ఈ ఉదంతంపై నిర్మాత నట్టికుమార్ మండిపడుతున్నారు. అర్థరాత్రి వేళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది.

అసలేం జరిగిందంటే.. బ్యూటిఫుల్ సినిమాను కంట్రీక్లబ్ లో ప్రమోషన్ చేస్తామని ఈవెంట్ మేనేజర్ సుమన్ చెప్పటంతో అక్కడకు వెళ్లారు నట్టికుమార్ కుమారుడు. అయితే.. ప్రమోషన్ చేయకపోవటమే కాదు.. కంట్రీ క్లబ్ లోకి అనుమతించలేదట. పార్కింగ్ చేస్తామని కారు తాళాలు తీసుకొని తిరిగి ఇవ్వకపోవటంతో నట్టికుమార్ కుమారుడు క్రాంతి డయల్ 100కు ఫోన్ చేశారు.

వెంటనే కంట్రీ క్లబ్ కు చేరుకున్న పోలీసులు డయల్ 100కు ఫోన్ చేస్తావా అంటూ క్రాంతి మీద దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసున్న నిర్మాత నట్టి కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జరిగిన ఉదంతం గురించి తెలుసుకొని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. డయల్ 100కు ఫోన్ చేస్తే తన కుమారుడ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన ఆయన.. ఎందుకిలా చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఈ ఈవెంట్ కు రాంగోపాల్ వర్మ కూడా రావాల్సి ఉందని.. డబ్బు తీసుకున్న ఈవెంట్ నిర్వాహకులు తమను మోసం చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో విషయం తెలుసుకున్న మిగిలిన పోలీసులు క్షమాపణలు చెప్పటంతో నట్టికుమార్ శాంతించారు. డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు దాడి చేసిన ఉదంతం సంచలనంగా మారింది. మరి.. దీనిపై సీనియర్ పోలీసు అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.