Begin typing your search above and press return to search.

నటి జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు

By:  Tupaki Desk   |   17 July 2019 5:44 AM GMT
నటి జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు
X
జనాలకు చేరువచేయాలంటే పదునైన ఆయుధం సినిమా. దీని ద్వారా ఎన్నో సందేశాలు ఇవ్వొచ్చు. సంచలనాలు సృష్టించవచ్చు. అయితే కొన్ని వాస్తవ పరిస్థితులను తేటెతెల్లం చేసే సినిమాలు ప్రస్తుతం వస్తున్నాయి. సమాజంలోని నిర్లక్ష్యాన్ని.. పనిచేయని ఉద్యోగుల డొల్లతనాన్ని అవి కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. కానీ సదురు ఉద్యోగులు మాత్రం దీన్నొక సాకుగా చూపి సినిమాలను అడ్డుకోవడం జరుగుతోంది.

తాజాగా సీనియర్ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళనాట విడుదలైన ‘రాక్షసి’సినిమా వివాదాస్పదమైంది. ఇందులో ప్రభుత్వఉపాధ్యాయుల అసమర్థతను, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. స్వయంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పాత్రలో జ్యోతిక నటించారు. ఉపాధ్యాయులు సరిగా పాఠాలు చెప్పకుండా పుస్తకాలు చదువుతూ.. సెల్ ఫోన్లతో కాల గడుపుతుంటారు. విద్యార్థులు సిగరెట్లు, మందు తాగుతూ గొడవలు పడుతుంటారు. అత్యధిక వేతనాలు తీసుకునే ఉపాధ్యాయులు విద్యార్థులపై సరిగా దృష్టిసారించకపోవడం వల్లనే వారు వైద్య విద్య లాంటి ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని సినిమాలో చూపించారు.

దీనిపై తమిళనాడు ఉపాధ్యాయుల సంఘం కన్నెర్ర చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే ఇళమారన్ తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాక్షసి చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే పిల్లలు చదవలేకపోతున్నారనే సన్నివేశాలు చూపించారని.. దేశం నాశనానికి కారణమని సంభాషణలు, సన్నివేశాలున్నాయని.. ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరారు. అంతేకాదు.. నటి జ్యోతిక, చిత్రయూనిట్ పై చర్యలు చేపట్టాలని కోరారు.