Begin typing your search above and press return to search.

స్టార్ హీరో అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్!

By:  Tupaki Desk   |   10 Jun 2022 10:30 AM GMT
స్టార్ హీరో అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్!
X
ఎవ‌రో చేసిన త‌ప్పుల‌కు మ‌రోక‌రిని బాధ్యుల‌ను చేస్తూ కేసులు పెట్ట‌డం వంటిది గ‌త కొంత కాలంగా జ‌రుగుతూ వ‌స్తోంది. సెల‌బ్రిటీలు క్రేజీ ప్రొడ‌క్ట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారి క‌మ‌ర్ష‌యిల్ యాడ్స్ తో అద‌ర‌గొడుతున్నారు. అయితే అవి కొంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతున్నా కొన్ని మాత్రం బెడిసికొడుతున్నాయి. స్టార్స్ ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌ద‌రు సంస్థ‌లు స‌క్ర‌మంగా వుంటే స‌రి అదే సంస్థ‌లు ఏదైనా త‌ప్పుచేస్తే మాత్రం స్టార్స్ ని సామాన్యులు అడ్డంగా బుక్ చేస్తున్నారు.

ఇలాంటి సంస్థ‌కు ఎలా ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిని బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ నుంచి ఇటీవ‌ల విమ‌ల్ పాన్ మ‌సాలా యాడ్ లో న‌టించిన బాలీవుడ్ స్టార్స్ అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ్ గ‌న్‌, షారుక్ ఖాన్ ఎదుర్కొన్నారు.

పాన్ మ‌సాలా యాడ్ లో న‌టించినందుకు అక్ష‌య్ కుమార్ పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు కూడా దీంతో అక్ష‌య్ నేరుగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఈ యాడ్ లో న‌టించ‌డం త‌న త‌ప్పిద‌మేన‌ని క్ష‌మాప‌ణ‌లు కోరారు.

ఆ త‌రువాత ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ నుంచి కూడా తాను త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు కూడా. ఇదిలా వుంటే తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు ఇదే త‌ర‌హాలో షాక్ త‌గిలింది. 'పుష్ప‌' పాన్ ఇండియా హిట్ త‌రువాత అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా జోరు పెంచారు.

రెడ్ బ‌స్‌, జొమాటో, మ్యాంగో ఫ్రూటీ, ర్యాపిడో, ఏన‌గ తో పాటు ఓ ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓ ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ల కోసం జూన్ 6న వివిధ దిన‌ప‌త్రిక‌ల్లో ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ని ప్ర‌చురించారు.

ఇందులో IIT, NIT ర్యాంకుల్ని త‌ప్పుగా చూపించారంటూ హైద‌రాబాద్ అంబ‌ర్ పేట‌కు చెందిన ఓ వ్య‌క్తి అల్లు అర్జున్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ముఖ విద్యాసంస్థ దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌చురించిన యాడ్ లో IIT, NIT ర్యాంకుల్ని త‌ప్పుగా చూపించారని, అందుకు బాధ్య‌త‌గా స‌ద‌రు సంస్థ‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అల్లు అర్జున్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉపేంద‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి అంబ‌ర్ పేట పీఎస్ లో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.