Begin typing your search above and press return to search.

సంజయ్ లీలా భన్సాలీని మూడు గంటలపాటు విచారించిన పోలీసులు!

By:  Tupaki Desk   |   7 July 2020 2:30 PM GMT
సంజయ్ లీలా భన్సాలీని మూడు గంటలపాటు విచారించిన పోలీసులు!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సోమవారం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని మూడు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు.

సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ మాఫియా కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ను బాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలు, దర్శకులు తొక్కేశారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జూలై 6న విచారణకు హాజరు కావాలంటూ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పోలీసులు నోటీసులు పంపారు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తాజాగా భన్సాలీ తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు భన్సాలీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది.

విచారణ సందర్భంగా సుశాంత్ కు హీరోగా ఆఫర్లు ఇచ్చి ఆ తర్వాత ఎందుకు తిరస్కరించారని పోలీసులు భన్సాలీని ప్రశ్నించినట్టు తెలిసింది. దీనివెనుక ఎవరున్నారు? కారణం ఏంటని ఆరాతీశారు. దీనికి తన సినిమా ఆఫర్ ఇచ్చిన సమయంలో సుశాంత్ కు వేరే సంస్థతో కాంట్రాక్ట్ ఉందని.. ఆ కారణంగానే తామిద్దరం పనిచేయలేకపోయమని భన్సాలీ చెప్పినట్టు తెలిసింది.

ఇక భన్సాలీతోపాటు చాలా మంది సినీ ప్రముఖులను, సన్నిహితులను విచారించడానికి పోలీసులు నోటీసులు పంపుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సుశాంత్ మరణం తర్వాత మీడియాలో వచ్చిన కథనాలపై ఆరాతీస్తున్నారు. కథనం వెనుక వాస్తవమెంత? అనే కోణంలోనూ ఆరాతీస్తున్నారట.. సుశాంత్ మరణానికి కారకులెవరు అంటూ రాసిన ఓ జర్నలిస్టును కూడా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపినట్టు తెలిసింది.ఇప్పటిదాకా సుశాంత్ ఆత్మహత్యకేసులో పోలీసులు 30మందిని ప్రశ్నించారు.