Begin typing your search above and press return to search.

‘యముడు’ ఉసురు తీసిన మీడియా.. నిజమెంత?

By:  Tupaki Desk   |   23 Dec 2022 5:33 PM GMT
‘యముడు’ ఉసురు తీసిన మీడియా.. నిజమెంత?
X
బాధ్యతతో వ్యవహరించాల్సిన మీడియా.. అందుకు భిన్నంగా చిన్న పిల్లాడి మాదిరి వ్యవహరిస్తే ఏమవుతుంది? భావోద్వేగాల్ని పలికించే కన్నా.. అందుకు భిన్నంగా భావరహితంగా సమాచారాన్ని నిజాయితీగా ప్రజలకు అందించటమే తప్పించి.. అందుకు బదులుగా కాస్తంత ఉప్పు.. మరికాస్త కారం.. ఇంకాస్త మసాలా పొడి వేయాలన్న ఆలోచనే అన్యాయం. అయితే.. ఇప్పటి మీడియా సంస్థలు.. అందులో పని చేసే పాత్రికేయుల్లో చాలామంది ట్రెండ్ కు తగ్గట్లు దూసుకెళదామనే తప్పించి.. తొందరపాటు అస్సలు పడకూడదన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల్ని.. సెలబ్రిటీలను తమ అత్యుత్సాహంతో బతికి ఉన్నప్పుడే చంపేసి.. చప్పున నాలుక కర్చుకొని కిమ్మనకుండా ఉండటమే తప్పించి.. తప్పైందని చెంపలు వేసుకోవటం ఎప్పుడైనా చూశారా? కరోనా లాంటి ప్రమాదకర వైరస్ మళ్లీ కొత్త వేరియంట్ తో ఒక ఊపు ఊపుతుందన్న మాట వినిపిస్తున్న వేళ.. అందులోనిజం ఎంత? అబద్ధం ఎంత? వాస్తవం ఎంత? లాంటి ప్రశ్నల్ని పక్కన పెట్టేసి.. తానా అంటే తందానా? అన్నట్లుగా వ్యవహరించటం ఎంతవరకు న్యాయం? మరెంత వరకు ధర్మం?

ఎవరో ఏదో రాసిన విషయాల్ని.. మరింత మసాలా దట్టించేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఈ తీరుతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు చైనాను చుట్టేసి.. ఆరాచకంగా మారిన కరోనా కొత్త వేరియంట్ కు సంబంధించిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయటం.. వేగిరంగా పనుల్ని చేపడుతున్న వేళ.. మీడియా అలెర్టు అయ్యింది. ఎవరికి వారు తమ శక్తి మేర విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎంతో మందికి ఈ కొత్త వేరియంట్ కొత్త టెన్షన్ గా మారింది.
ఇదే తాజాగా ఒక ప్రముఖుడి ఉసురు తీసిందా? అన్నది చర్చగా మారింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంగా ఉన్నది నిజమే అయినా.. తాజాగా కొవిడ్ ను మీడియా చూపించిన తీరు.. వార్తలతో ఆయన తల్లడిల్లిపోయారని.. ఆయనకు ఈ వేరియంట్ కొత్త టెన్షన్ గామారిందంటున్నారు. 87 ఏళ్ల కైకాల కొత్త వేరియంట్ గురించి ఆందోళన చెందారని చెబుతున్నారు. కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న ఆయన.. చలికాలం కావటంతో శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన కన్నుమూశారని ఆయన సోదరుడు నాగేశ్వర్ రావు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా మీద మీడియాలో వస్తున్న కథనాలు అవగాహన కలిగించే కన్నా.. భయాన్ని.. ఆందోళనను.. ఏదో జరిగిపోతుందన్నట్లుగా పరిస్థితులు మారాయని చెబుతున్నారు. ఇలాంటి తీరుతో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే కైకాల మరణించి ఉంటారంటున్నారు. మీడియాలో వస్తున్న టెన్షన్ పుట్టించే వార్తలు యుముడు ఉసురును తీశాయన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా వైరల్ గా మారిన ఒక పోస్టును యథాతధంగా చూస్తే..

నవరస నటనా సౌర్వ భౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ అనారోగ్యం తో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఇవాళ తెల్లారు జామున కనుమూశారు! వయసు 87. మనం నమ్మలేం కానీ, ఇది నిజానికి మన మీడియా కోవిడ్కొం ని చూపించి భయపెట్టిన మరణం గా భావించాలి! ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యం తో వున్నారు నిజమే! కానీ, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు! మంచానికి పరిమితమయ్యారు! నిన్న కొత్త వేరియంట్ గురించి మీడియా భూతద్ధం లో చూపించిన తీరు కు ఆయనే కాదు, చాలా మంది భయపడిపోయారు! నమ్మినా మీడియా అంగీకరించక పోయినా ఇది వాస్తవం!

మొత్తం 777 సినిమాల చరిత్ర కైకాల గారిది! గత కొన్నాళ్లుగా అనారోగ్యం తో వున్నారు! 14 నెలలుగా ఇంటి దగ్గరే వైద్యులు పర్యవేక్షిస్తున్నారు! ఆరోగ్యం అంతంత మాత్రమే! కృష్ణ, కృష్ణంరాజు చనిపోయిన విషయం తెలుసుకుని బాగా కుమిలిపోయారు! నిన్న మన మీడియా హోరేత్తించిన తీరుకు అమితంగా భయపడిపోయారు! ఏమీ లేకపోయినా ముంచేస్తున్న ప్రమాదం అంటూ మీడియా ఊదరగొట్టిన తీరుకు దాదాపు అందరూ భయపడ్డారు! సత్యనారాయణ గారు కూడా నిన్న కుటుంబ సభ్యులతో అన్నారట... మూడు కరోనా వేవ్ లను తట్టుకున్నా... రాబోయేది తట్టుకోలేనేమో అని ఆందోళన చెందారట! తెల్లారు జామున నాలుగు గంటలకు గుండె పోటు తో కనుమూసినట్లు సమాచారం! 5.40 నిముషాలకు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆరున్నర గంటలకు వైద్యులు నిర్ధారించారు.

నంది పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారాలు, ఎన్టీఆర్ పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డు ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి! కానీ, ఆయనకు పద్మశ్రీ రాలేదనే అసంతృప్తి ఉండేది! మారిన రాజకీయ కోణాలు తెలుసుకుని కళా రంగం లోనూ రాజకీయం అని ఆవేదన వ్యక్తం చేసే వారు! మంచి నటుడ్ని కోల్పోయాం! మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి వచ్చి కైకాల గారితో మూడు గంటలు గడిపినప్పటి నుంచి ఆయనలో కొత్త ఆనందం చూసామని కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవి భార్య సురేఖ తో నువ్వు వండిన ఉప్పు చేప తినాలని కోరారని, ఆ రోజు చిరంజీవి తో చిన్న పిల్లాడిలా మారిపోయి సంతోషంతో గడిపారని, పదే పదే ఆ తరువాత పలుమార్లు గుర్తు చేసుకున్నారని సత్యనారాయణ గారి చిన్న అల్లుడు తెలిపారు. ఆయన చేసిన పాత్రలను గుర్తు చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ అనేక విషయాలు చెబుతుండే వారు! మంచి ఆత్మీయ నట స్నేహితుడు శ్రీ సత్యనారాయణ గారికి శ్రద్ధాంజలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.