Begin typing your search above and press return to search.

సూపర్ హీరో 'శక్తిమాన్' గా కనిపించే పాపులర్ స్టార్..?

By:  Tupaki Desk   |   12 Feb 2022 2:30 AM GMT
సూపర్ హీరో శక్తిమాన్ గా కనిపించే పాపులర్ స్టార్..?
X
మోస్ట్ పాపులర్ హిందీ టీవీ సీరియల్ ''శక్తిమాన్'' ఇప్పుడు ఫీచర్ ఫిలింగా రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు టైటిల్ అనౌన్సమెంట్ వీడియో శుక్రవారం విడుదల చేయబడ్డాయి. 90వ దశకంలో ఇండియన్ స్మాల్ స్క్రీన్ మీద సంచలనం సృష్టించిన ఈ టీవీ సిరీస్ హక్కులను కార్పొరేట్ దిగ్గజం సోని పిక్చర్ సొంతం చేసుకుంది. దీన్ని మూడు భాగాలుగా వెండితెర మీదకు తీసుకురావడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు.

హిందీలో డీడీ నేషనల్ లో ప్రసారమైన ''శక్తిమాన్'' సీరియల్.. ప్రాంతీయ భాషల్లో కూడా డబ్బింగ్ చేయబడింది. అతీంద్రీయ శక్తులను ఉపయోగించి అనితరసాధ్యమైన సాహసాలు చేస్తూ.. దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడే ఈ సూపర్ హీరో సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ గా శక్తిమాన్ గుర్తింపు పొందారు. ఇప్పుడు అలాంటి క్యారక్టర్ ను సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్నారు.

సీరియల్ లో శక్తిమాన్ క్యారెక్టర్ ని నటుడు, నిర్మాత ముఖేష్ ఖన్నా పోషించారు. నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు వెండితెర మీదకు రాబోతున్న ''శక్తిమాన్'' ట్రయాలజీలో సూపర్ హీరోగా ఎవరు నటిస్తున్నారనేది ప్రకటించలేదు. సోనీ పిక్చర్స్ వారు టైటిల్ తప్ప మరే ఇతర వివరాలు వెల్లడించలేదు చెప్పలేదు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

అయితే అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ''శక్తిమాన్'' సినిమాలో దేశంలోనే మోస్ట్ పాపులర్ సూపర్‌ స్టార్‌ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలోని క్రేజీ స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్ అయితే బాగుంటుందని సోనీ పిక్చర్స్ వారు అనుకుంటున్నారట. అదే సమయంలో 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటిన అల్లు అర్జున్‌ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి.

ఒకవేళ ప్రభాస్ - బన్నీ లతో కుదరకపోతే ప్రత్యామ్నాయంగా బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ తో ముందుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. 'క్రిష్' సినిమాలతో హృతిక్ రోషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల 'మిన్నల్ మురళి' అనే లోకల్ సూపర్ హీరో కూడా అలరించాడు. ఈ క్రమంలో 'శక్తిమాన్' గా ఏ స్టార్ హీరో మారుతారో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ముఖేష్ ఖన్నా కూడా ఇందులో భాగమవ్వనున్నారని సమాచారం.