Begin typing your search above and press return to search.

థర్టీ ఇయర్స్ పృద్వీ పై పోసాని పంచ్!

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:38 AM GMT
థర్టీ ఇయర్స్ పృద్వీ పై పోసాని పంచ్!
X
ఎత్తుకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం చాలా అవసరం. మొన్నటి వరకూ కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వ్యవహరించిన వ్యక్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుణ్యమా అని కీలక పదవి వచ్చినప్పుడు మరింత కష్టపడాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అనవసరమైన వ్యాఖ్యలతో అందరి కంట్లో పడటం మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో తెలుగు ప్రజలకు సుపరిచితమైన పృద్వీ.. టాలీవుడ్ మీద చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికి మించిన ఆయన మాటల్ని తప్పు పడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్లో ఒకరైన పోసాని వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

జగన్ ముఖ్యమంత్రి కావటం తెలుగు సినీ పెద్దలకు ఇష్టం లేదని పృద్వీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా పోసాని స్పందించారు. పృద్వీ తొందరపడి మాట్లాడి ఉండొచ్చని ఆయన అన్నారు. జగన్ సీఎం కావటం సినీ పెద్దలకు ఇష్టం లేదనటం సరైనది కాదని.. చంద్రబాబు గెలవాలని సినీ పెద్దలు కోరుకోవటం సహజమేనన్నారు. వైఎస్ మినహా 1983నుంచి ఏపీని పాలించిన ముఖ్యమంత్రులందరి కంటే జగన్ బాగా పాలిస్తున్నట్లుగా చెప్పిన పోసాని.. పృద్వీ వ్యాఖ్యలపై మాత్రం విభేదించటం గమనార్హం.

2012 ఉప ఎన్నికల్లో జగన్.. విజయమ్మల తరఫున ప్రచారం చేశానని.. అప్పట్లో పార్టీ తరఫున ప్రచారం చేయటానికి తాను.. రోజా తప్పించి మరెవరూ లేరన్నారు. పార్టీకి ఎంత చేయాలో అంత చేశానని.. పదవి ఇస్తే కాదనని.. అలా అని పదవి కోసం ఎగబడనని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ సందర్భంగా పోసాని మరో కీలక వ్యాఖ్య చేశారు. తన కంటే బాగా కష్టపడటం వల్ల తన కంటే జూనియర్లకు పదవులు వచ్చాయన్నారు.

పోలవరం కాంట్రాక్టుల విషయంలో సీఎం జగన్ చొరవను తాను అభినందిస్తున్నట్లు చెప్పిన పోసాని.. ఇటీవల తాను అనారోగ్యానికి గురైతే.. తాను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. మే 13న అనారోగ్యానికి గురై యశోదలో చేరానని.. రెండు నెలలుగా బాగా ఇబ్బంది పడ్డానని.. ఒకదశలో చనిపోతానన్న భయం వేసిందన్నారు. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంతో వేషాలు ఇచ్చే వారు సైతం వెనక్కి తగ్గుతున్నారన్నారు.

దగ్గుపాటి సురేష్ బాబు సీఎం జగన్ సమయాన్న అడడిగారని.. అసెంబ్లీ సమావేశాల తర్వాత టైమిస్తానని చెప్పారని.. ట్విట్టర్ లో లోకేశ్ ను ఫాలో కావాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఆయన 24 గంటలూ ఖాళీనేనని.. అందుకే ట్విట్టర్ ఖాతాలో బిజీగా ఉన్నట్లు ఎద్దేవా చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. మరి శివాజీ ఏ పార్టీనో తనకు తెలీదన్నారు. అతని మాదిరి తానంత పెద్ద హీరోను కాదని.. అతనిపై కామెంట్ చేసే స్థాయి తనకు లేదంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తున్నాయి.