Begin typing your search above and press return to search.

బాలకృష్ణ పాత్రలో పోసాని

By:  Tupaki Desk   |   22 Feb 2016 1:30 PM GMT
బాలకృష్ణ పాత్రలో పోసాని
X
ఈ మధ్య టాలీవుడ్లో వస్తున్న చిన్న సినిమాల్లో పెద్ద హీరోల రెఫరెన్సులు ఎక్కువైపోయాయి. స్టార్ హీరోల అభిమానుల్ని ఆకర్షించడం కోసమో.. పబ్లిసిటీకి ఉపయోగపడుతుందనో.. ఉద్దేశం ఏదైనా సరే.. స్టార్ హీరోల్ని భలే తెలివిగా వాడేస్తున్నారు చిన్న సినిమాల డైరెక్టర్లు. ఈ మధ్యే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో బాలయ్యను నాని అండ్ కో ఏ రేంజిలో వాడిందో తెలిసిందే. ఐతే ఎక్కడా బాలయ్య అభిమానులు హర్టవ్వకుండా.. వాళ్లింకా సంతోషించాలా సినిమాలో బాలయ్య ప్రస్తావన తెచ్చారు. ఐతే నాని కేవలం బాలయ్య అభిమానిగా మాత్రమే కనిపిస్తే.. ఇప్పుడో కొత్త సినిమాలో ఓ పాత్రధారి నేరుగా ‘బాలకృష్ణ’ అనే పేరే పెట్టేసుకోవడం విశేషం.

ఆ సినిమా ‘రన్’ కాగా.. బాలకృష్ణ అని పేరు పెట్టుకున్న నటుడు పోసాని కృష్ణమురళి. ఈ సినిమాలో ఆయన కథను మలుపు తిప్పే పాత్ర ఒకటి చేస్తున్నాడు. ఆ పాత్ర పేరు బాలకృష్ణ. ఐతే ఈ పాత్ర తీరుతెన్నులేంటన్నది తెలియదు కానీ.. బాలకృష్ణ అని పేరు పెట్టుకోవడం మాత్రం ఆసక్తి రేపుతోంది. నిన్న ‘రన్’ సినిమాలోని క్యారెక్టర్లని పరిచయం చేస్తూ వదిలిన టీజర్లో ఈ సంగతి వెల్లడైంది. హీరో సందీప్ కిషన్ సంజుగా నటిస్తుంటే.. హీరోయిన్ అనీషా ఆంబ్రో అమ్ము అనే పాత్రలో కనిపించబోతోంది. విలన్ బాబీ సింహా వడ్డీ రాజా అవతారమెత్తుతున్నాడు. ఐతే ఎవరి పాత్రల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈ ‘బాలకృష్ణ’ పాత్ర ఎలా ఉంటుందనేదే జనాల్లో ఆసక్తి రేపుతున్న అంశం.