Begin typing your search above and press return to search.

'సర్దార్ నుంచి అందుకే నన్ను తీసేసారు.. పవన్ కు నామీద పీకల దాకా కోపం ఉంది'

By:  Tupaki Desk   |   28 Sep 2021 1:55 PM GMT
సర్దార్ నుంచి అందుకే నన్ను తీసేసారు.. పవన్ కు నామీద పీకల దాకా కోపం ఉంది
X
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై నటుడు దర్శక నిర్మాత పోసాని కృష్ణ మురళి సోమవారం రాత్రి మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మంగళవారం మరోసారి పోసాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. పవన్ ను ప్రశ్నించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని.. తనని తిడుతూ నిన్న రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్‌ కాల్స్‌ - అసభ్య కరమైన మెస్సేజ్‌ లు పెడుతున్నారని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని.. కానీ ఇలా కక్ష కట్టి మాట్లాడటం సరికాదని.. పవన్‌ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పోసాని తెలిపారు. ఇప్పుడు నా ఫ్యామిలీని దూషిస్తున్న ఫ్యాన్స్ అంతా.. పవన్ కళ్యాణ్ ను కేసీఆర్‌ బహిరంగంగా తిట్టినప్పుడు ఆయన ఫ్యామిలీని తిట్టలేకపోయారు? జగన్ తిరిగి ఏమీ తిట్టడు కాబట్టి ఆయన్ని విమర్శిస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమా నుంచి తనను తొలగించిన విషయాన్ని పోసాని కృష్ణ మురళి బయట పెట్టారు. ''సర్దార్‌ సినిమా రాత్రి షెడ్యూల్‌ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆరోగ్య సమస్యల వల్ల సాధారణంగా నేను సాయంత్రం 6 గంటలకు వెళ్లిపోతా. మేనేజర్ కోరితే.. పెద్ద హీరో కదా అని రాత్రి 9 గంటల వరకు ఉంటానని చెప్పా. 9 వరకు వేచి చూసినా హీరో గారు రాలేదు. దీంతో మీరు చెప్పిన టైం అయిపోయిందిగా సర్ అని మేనేజర్ చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయా. రాత్రి 10.30 గంటలకు ఇంట్లో భోజనం చేస్తుంటే పవన్ కల్యాణ్ ఫోన్‌ చేశారు. 'మేము పిచ్చోళ్లమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు?' అదీ ఇదీ అని గట్టిగా అరవడం మొదలు పెట్టారు''

''దాంతో నాకు కోపం వచ్చి.. ''మీరు 10 గంటలకు వస్తే, మేము అప్పటివరకూ ఉండాలా? నేను కూడా ఆర్టిస్ట్‌ నే. 9 గంటల వరకూ ఎదురు చూశా. నువ్వు రాలేదు'' అని నేను కూడా కాస్త గట్టిగానే మాట్లాడాను. ఆ తర్వాత నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. నామీద పవన్ కు పీకల వరకూ కోపం ఉంది. అయితే, నేను మాత్రం ఆయనపై ఎప్పుడూ కోపం పెట్టుకోలేదు. 30ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను జగన్‌ గారి అభిమానిని. అది చచ్చే వరకు ఉంటుంది. ఆయన్ను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. కాకపోతే మీ అభిమానుల్లా నేను బూతులతో మాట్లాడను. ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడతాను'' అని పోసాని కృష్ణ మురళి తెలిపారు.