Begin typing your search above and press return to search.

చస్తే పదిమంది రాని పరిశ్రమ గురించి నాకు తెలుసు: పోసాని

By:  Tupaki Desk   |   13 Feb 2022 3:06 AM GMT
చస్తే పదిమంది రాని పరిశ్రమ గురించి నాకు తెలుసు: పోసాని
X
మోహన్ బాబు కథానాయకుడిగా 'సన్నాఫ్ ఇండియా' సినిమా రూపొందింది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై పోసాని మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి రోల్ చేసే అవకాశం వచ్చింది. మోహన్ బాబు గారు గురించి ఏం చెప్పమంటారు? ఆయన గురించి తెలియనివారు పరిశ్రమలో లేరు. నటుడిగా ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడతారో, అంతే స్పష్టమైన మనసుతో మాట్లాడతారు. అందువలన ఆయనను పొగడడం తప్పే .. తెగడడం తప్పే.

ఆయనలాంటివారు తెలుగు ఇండస్ట్రీలో గొప్ప సక్సెస్ అయితే ఇండస్ట్రీకి లాభం. అందువలన ఆయన లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తే చాలామందికి అన్నం పెట్టినవాళ్లవుతారు. దేవుడికి దణ్ణం పెట్టడం చాలా ఈజీ .. పేదలకు అన్నం పెట్టడం చాలా కష్టం. మంచు ఫ్యామిలీ ఎంత మంచిది కాకపోతే ఎలక్షన్స్ లో ఎవరు గెలవనంత మెజారిటీతో మంచు విష్ణు గెలుస్తాడు? ఆయన ఆరడుగుల జెండా కాదు .. పెద్ద గొప్పవాడేం కాదు .. అతను మామూలు మనిషి. మనిషి లక్షణాలతో పుట్టాడు గనుకనే ఆయన గెలిచాడు.

మనిషి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలామందికి తెలియక పోవచ్చును. మనిషి లక్షణం అంటే నవ్వొస్తే నవ్వాలి .. ఏడుపొస్తే ఏడవాలి. జనం ముందు నవ్వు రాకపోయినా నవ్వుతూ .. ఏడుపురాకపోయినా ఏడుస్తూ ఉండేవారు అసామాన్యులు. మంచు ఫ్యామిలీలో వాళ్లంతా సామాన్యమైన మనుషులు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తరువాత పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేశాను. వాళ్ల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. వాళ్లలా నేను బతక్కూడదని అనుకున్నాను .. ఇది వాస్తవం. పరుచూరి బ్రదర్స్ ఎలా బతకాలో తెలియని మనుషులు.

చాలామంది అనుకుంటారు .. చాలా యారోగంట్ ఫెలోస్ అని. అలాంటి పరుచూరి బ్రదర్స్ నీ .. అంతకంటే గొప్ప అయిన ఆత్రేయ గారిని .. వేటూరి గారిని ఈ పరిశ్రమ ఎంత దూరం పెట్టిందో నాకు తెలుసు. అందువలన నేను పరుచూరి బ్రదర్స్ ను చూసి .. ఆత్రేయను చూసి .. శ్రీశ్రీని చూసి .. వేటూరిని చూసి .. ఇంకా చాలామందిని చూసి ఈ బ్రతుకు మనకు వద్దు .. నేను ఎలా అనుకున్నానో అలానే బ్రతకాలి అనుకున్నాను. అలా ఉంటేనే ఇక్కడ జీవితాంతం నేను బ్రతుకుతాను .. లేదంటే సగం జీవితం గడిచాక ఇదే పరిశ్రమలో కుక్కచావు చస్తాను.

చస్తే పదిమందిరాని పరిశ్రమ గురించి నాకు తెలుసు. ఇక్కడ చావు కూడా ఖరీదుగా ఉండాలి. పేదరికంతో కూడిన చావుకి పదిమంది కూడా రారు. డబ్బున్నోడి చావు .. పదివేలమందిని తీసుకుని వస్తుంది. ఆ రెండు చావుల మధ్య బ్రతకడం నాకు ఇష్టం లేదు. నేను .. నా కుటుంబం దూరంగా బ్రతుకుతున్నాము. రేప్పొద్దున పోసానిని సినిమా పరిశ్రమ బహిష్కరించినా, నా మనవళ్లు .. మనవరాళ్లకు సరిపడా సంపాదించి కూర్చున్నాను.

అందుకు కారణం సినిమా పరిశ్రమనే. నేను చెంచాగాళ్ల మాదిరిగా కాళ్ల దగ్గర దూరి, వాళ్లకి మందుపోస్తూ .. చికెన్ ముక్కలను అందించే బ్రతుకు నాకు వద్దు. నాకు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కాబట్టి ఇండస్ట్రీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు .. ఇక ఏమొచ్చినా నాకు అది బోనస్సే" అంటూ చెప్పుకొచ్చాడు.