Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' 3డీ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్.. రేపటి నుంచే స్పెషల్ షోలు..!

By:  Tupaki Desk   |   6 Oct 2022 3:00 PM GMT
ఆదిపురుష్ 3డీ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్.. రేపటి నుంచే స్పెషల్ షోలు..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్'' రామాయణ ఇతివృత్తంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ ప్రతిష్టాత్మక సినిమాని తెరకెక్కించారు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ టీజర్ ను ఇటీవలే అయోధ్యలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది.

దాదాపు రెండు నిముషాల నిడివి గల 'ఆదిపురుష్' టీజర్ లో గ్రాఫిక్స్ మరియు VFX వర్క్స్ చాలా దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు. ఇది మోషన్ క్యాప్చర్ పిక్చర్ లా లేదని.. కార్టూన్ సినిమాల ఉందని విమర్శించారు. టీజర్ రిలీజైన దగ్గర నుంచీ ట్రోలింగ్ తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ టీజర్ మీద వచ్చిన ట్రోలింగ్.. మరే ఇతర సినిమా విషయంలో జరగలేదని చెప్పాలి.

'ఆదిపురుష్' టీజర్ పై వస్తున్న ట్రోల్స్ పై దర్శకుడు ఓం రౌత్ స్పందిస్తూ.. దీన్ని సెల్ ఫోన్ లో చూసేందుకు చిత్రీకరించలేదని.. బిగ్ స్క్రీన్ కోసం తీసామని.. అది ఫోన్ లో చూడలేనంత భారీ చిత్రమని.. పెద్ద స్క్రీన్ పై అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు టీజర్ ని బిగ్ స్క్రీన్స్ మీద ప్రదర్శించడానికి చిత్ర బృందం రెడీ అయింది.

ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని ఎఎంబీ సినిమాస్ లో మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా 'ఆదిపురుష్' టీజర్ ను 3డీలో ప్రదర్శించారు. దీనికి మీడియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. స్మాల్ స్క్రీన్ మీద యూట్యూబ్ లో చూడటానికి.. బిగ్ స్క్రీన్ పై వీక్షించడానికి చాలా తేడా ఉందని.. త్రీడీలో సరికొత్త అనుభూతిని పంచుతోందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో 'ఆది పురుష్' 3-D టీజర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ స్క్రీనింగ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించుకున్నారు. రేపటి నుండి తెలంగాణా & ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన థియేటర్లలో ఈ టీజర్ ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. మ్యాట్నీ మరియు ఫస్ట్ షో మధ్యలో సాయంత్రం 5 నుండి 7 వరకు టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని షో టైమింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా థియేటర్ల వివరాలను కూడా సోషల్ మీడియాలో తెలియజేసారు.

'ఆదిపురుష్' టీజర్ ట్రోలింగ్ పై ఇటీవల దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ట్రోలింగ్ చూసి కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమే. ఐతే ట్రోలింగ్స్ కు పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ కోసం తీశాం. మొబైల్ ఫోన్స్ లో చూడటానికి భిన్నంగానే ఉంటుంది. థియేటర్ లో తెర సైజు తగ్గచ్చేమో కానీ.. ఆ పరిమాణాన్ని మరీ మొబైల్ కు తగ్గించకూడదు''

''నేను యూట్యూబ్ లో పెట్టకుండా నిరోధించగలను. నాకు అది కేవలం ఓ గంట పని మాత్రమే. కానీ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్ధేశ్యంతోనే ఉంచాం. కేవలం ప్రేక్షకుల ఆనందం కోసం మాత్రమే టీజర్ విడుదల చేశాం. చిత్రం విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. థియేటర్లలో అరుదుగా సినిమాలు చూసే వాళ్ల కోసం ఈ సినిమా తీయలేదు''

''సీనియర్ సిటిజన్లు, మారుమూల గ్రామాల్లో ఉండేవారు కూడా థియేటర్లలో సినిమా చూసేందుకు రప్పించడం మా ప్రధాన ఉద్ధేశ్యం. ఎందుకంటే ఇది రామాయణం. గ్లోబల్ కంటెంట్ ను చూడాలనే ఆసక్తి ఉన్న పెద్దల నుంచి పిల్లల వరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అర్థమయ్యే భాషలో ఎక్కువ మందికి చేరువ చేసేందుకు 3డీ మోషన్ టెక్నాలజీని ఎంచుకున్నాం'' అని చెప్పుకొచ్చారు.

కాగా, ‘ఆది పురుష్’ చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్.. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కన్నడతో సహా పలు భాషల్లో 2D - 3D - IMAX 3D ఫార్మాట్లలో అందుబాటులోకి రానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.