Begin typing your search above and press return to search.

మా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: డబ్బు చెల్లించిన మంచు విష్ణు.. నో చెప్పిన ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   5 Oct 2021 10:30 AM GMT
మా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: డబ్బు చెల్లించిన మంచు విష్ణు.. నో చెప్పిన ప్రకాష్ రాజ్
X
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (మా) కాకరేపుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పై వివాదం నెలకొంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంచు విష్ణు ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్ ను దుర్వినియోగం చేస్తోందని సినీ నటుడు, మా అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ వివాదంపై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కరోనా కారణంగా తొలిసారి పోస్టల్ బ్యాలెట్ పెట్టాం.. ‘మా’లో 60 ఏళ్లు పైబడిన సభ్యులు 125మంది ఉన్నారు. ఇప్పటివరకు 60 మంది సభ్యులు పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగారు. సాయంత్రం 60 మందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిస్తాం.. పోస్టల్ బ్యాలెట్ పేపర్ కు నామినల్ గా రూ.500 చెల్లించాలి. డబ్బు చెల్లించాల్సిన బ్యాంక్ అకౌంట్ వివరాలు సభ్యులకు పంపాం. డబ్బు చెల్లింపుపై సీనియర్ సభ్యులకు అవగాహన లేదు. ఈ ప్రక్రియ కోసం మంచు విష్ణుకు వాళ్లు ఫోన్ చేశారట.. దీంతో ఆయన తరుఫున ఒక వ్యక్తి వచ్చి ఆ మొత్తం డబ్బు చెల్లించారు.’ అని అధికారి బాంబు పేల్చారు.

ఒకే వ్యక్తి డబ్బు చెల్లించడం నిబంధనలకు విరుద్ధం అని అధికారి కృష్ణమోహన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కు చెల్లించిన రూ.28వేలు తిరిగి ఇచ్చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే అవకాశం లేదు.. ప్రకాష్ రాజ్ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

ఒక వైపు నిబంధనలకు విరుద్ధం అంటూనే ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగిస్తారని ప్రకాష్ రాజ్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయం, అక్రమం అని ఆయన వాపోతున్నారు. దీనిపై ఎన్నికల అధికారి వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ‘మా’లో పోస్టల్ బ్యాలెట్ వివాదం ఇప్పుడు కాకరేపుతోంది.