Begin typing your search above and press return to search.

సింగర్ హరిణి తండ్రి పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   26 Nov 2021 3:58 AM GMT
సింగర్ హరిణి తండ్రి పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పింది?
X
సంచలనంగా మారిన ప్రముఖ గాయని హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఎనిమిది రోజుల క్రితం హడావుడిగా పంజాగుట్టలోని తన అపార్ట్ మెంట్ నుంచి బయటకు వచ్చిన ఆయన.. తాను అర్జెంట్ గా ఎయిర్ పోర్టుకు వెళ్లాలని వాచ్ మెన్ కు చెప్పి వెళ్లిపోయారు.

ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయిన ఆయన.. గురువారం ఉదయం ఆయన మరణ వార్త బయటకు వచ్చింది. బెంగళూరులోని రైల్వే ట్రాక్ వద్ద నిర్జీవంగా దొరికిన వైనం మీడియాలో ప్రముఖంగా మారింది.. రైలు పట్టాల దగ్గర అనుమానాస్పద రీతిలో శవమై పడి ఉన్న ఆయన్ను..అక్కడే ఉన్న ఆధార్ కార్డు ద్వారా ఏకే రావుగా గుర్తించారు.

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరికి చెందిన ఎన్జీవోకు సీఈవోగా.. సుజనా కంపెనీలకు లీగల్ అడ్వైజర్ గా వ్యవహరించినట్లుగా చెప్పే ఆయన.. గతంలో ఐఎస్ బీ విశ్రాంత డైరెక్టర్ గా కూడా పని చేసినట్లు చెబుతున్నారు.

డెడ్ బాడీ వద్ద పడి ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా యలహంక పోలీసులు మంగళవారం గుర్తించారు. ఆ డెడ్ బాడీ తమ తండ్రిదేనని ఏకే రావు రెండో కుమార్తె శాలినీరావు నిర్దారించారు. దీంతో.. ఈ విషయం కాస్త ఆలస్యంగా గురువారం బయటకు వచ్చింది.

ఆయన మరణంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? హత్య చేసుకున్నారా? అన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. చేతిపైనా.. గొంతు వద్ద ఉన్న కత్తిగాట్ల ఆధారంగా ఆత్మహత్య చేసుకొని ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా పోస్టు మార్టం రిపోర్టు కూడా బయటకు వచ్చింది. ఆయనది హత్య కాదని.. ఆత్మహత్యగా పోస్టు మార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఇంతకూ బెంగళూరు ఆయన ఎందుకు వచ్చారు. ఎక్కడ ఉన్నారు? లాంటి అంశాల మీద పోలీసులు ఫోకస్ చేశారు.

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక హోటల్ లో బస చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనపై సుద్దగుంట పాళ్య పోలీస్ స్టేషన్లో మోసం చేసిన కేసు ఆయనపై నమోదై ఉంది.ఏకే రావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హరిణి సింగర్ కాగా..రెండో కుమార్తె శాలనీరావు బెంగళూరులో ఉంటారు.

ఐఐటీ బాంబేలో బీటెక్ చేసిన ఆయన.. హైదరాబాద్ లో సత్యం కంప్యూటర్స్ లోనూ.. ఆడ్మినిస్ట్రేటిక్ స్టాఫ్ కాలేజీలోనూ ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోనూ.. సుజనా చౌదరికి సంబంధించిన కంపెనీల్లోనూ పని చేసినట్లు చెబుతున్నారు.

ఇంతకూ ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద కష్టం ఏమొచ్చింది? అది కూడా రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి మరీ సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? అన్నదిప్పుడు అనుమానాలుగా మారాయి.