Begin typing your search above and press return to search.

మహేష్ బాబు గారికి... పవన్‌

By:  Tupaki Desk   |   9 Aug 2022 1:39 PM GMT
మహేష్ బాబు గారికి... పవన్‌
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబుల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఇద్దరి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా నువ్వా నేనా అన్నట్లుగా సమానంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇద్దరికి ఉన్న అభిమానగనం సోషల్‌ మీడియాలో చేసే సందడి పలు సార్లు వరల్డ్‌ రికార్డులను కూడా నమోదు చేసిన విషయం తెల్సిందే.

ఇద్దరు అభిమానుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. కానీ ఇద్దరు హీరోల మద్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తాజాగా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా పవన్‌ కళ్యాణ్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. వృత్తి పరంగానే పోటీ తప్ప వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్‌ శుభాకాంక్షలతో తేలిపోయింది.

మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా పవన్ కళ్యాణ్‌ ప్రెస్ నోట్‌ ను విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ ప్రెస్ నోట్‌ లో... ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు.

‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమ ను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది.

కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. మహేష్ బాబు గురించి పవన్‌ కళ్యాణ్‌ నోట లేదా ఇలా ప్రెస్‌ నోట్‌ ద్వారా వినడం చాలా బాగుందని మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు పవన్‌ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇలాగే ముందు ముందు కూడా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు.