Begin typing your search above and press return to search.

కాలకేయుడు కన్నీళ్లు పెట్టించేశాడు

By:  Tupaki Desk   |   25 July 2015 2:18 PM GMT


తెరమీద కొందర్ని చూస్తే భయం కలుగుతుంది. నిజ జీవితంలోనూ వాళ్లు అంతే క్రూరంగా ఉంటారేమో అనిపిస్తుంది. కానీ తెరమీద భయంకరంగా కనిపించే కొందరు వ్యక్తులు నిజ జీవితంలో చాలా సాఫ్ట్ గా అనిపిస్తారు. చాలా సున్నిత మనస్కులై ఉంటారు. మర్యాద రామన్నలో బైర్రెడ్డి గా, బాహుబలిలో కాలకేయుడిగా ప్రేక్షకుల్లో భయం పుట్టించిన ప్రభాకర్ కూడా అలాంటి వాడే. బాహుబలి సినిమాతో దేశవిదేశాల్లో గుర్తింపు సంపాదించిన ప్రభాకర్.. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. తాను జీరోగా ఉన్నపుడు తనకు ఆర్థిక సాయం చేసి తిండి పెట్టిన మిత్రుడు ప్రవీణ్ గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

‘‘తెలిసిన వ్యక్తి పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటే హైదరాబాద్ కు వచ్చా. డబ్బులిచ్చి మోసపోయా. తిరిగి ఊరికి వెళ్లబుద్ధి కాలేదు. ఇక్కడే ఉంటూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో ప్రవీణ్ అనే ఫ్రెండు నన్ను ఆదుకున్నాడు. ఆయన నా కంటే పదేళ్లు పెద్దవాడు. క్రికెట్ ఆడుతుండగా పరిచయమయ్యాడు. ఆయనకు నేనంటే ఇష్టం. నా కష్టం చూసి నెల నెలా వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు. అలా ఐదేళ్ల పాటు ప్రతి నెలా డబ్బులిస్తూ నన్ను పోషించాడు. నేను డబ్బులు అడిగేవాణ్ని కూడా కాదు. అతనే డబ్బులు తెచ్చిచ్చేవాడు. ఇలాంటి వాళ్ల గురించి చెప్పాలి. కానీ నేను సినిమాల్లో నిలదొక్కుకుని ఈ స్థాయికి చేరుకున్నాక ఇదంతా చూడ్డానికి ఆయన లేరు. కొంత కాలం కిందట హార్ట్ అటాక్ తో చనిపోయారు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రభాకర్. తన మిత్రుడి గురించి చెబుతూ ప్రభాకర్ ఎమోషనల్ అయిపోయిన తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు