Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' పై 100 కోట్ల అదనపు భారం..?

By:  Tupaki Desk   |   6 Nov 2022 4:30 AM GMT
ఆదిపురుష్ పై 100 కోట్ల అదనపు భారం..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీ-సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు టాక్ నడుస్తోంది.

'ఆది పురుష్' చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరో రెండు నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకుంటుండగా.. ఇప్పుడు వాయిదా వేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పొంగల్ బరిలో 'వాల్తేరు వీరయ్య' - 'వీర సింహా రెడ్డి' - 'వారసుడు' వంటి భారీ సినిమాల విడుదలలు ఉన్న నేపథ్యంలో.. క్లాష్ ని నివారించడానికి 'ఆది పురుష్' వెనక్కి వెళ్తోందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ సినిమా టీజర్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద టీమ్ ఎక్కువ శ్రద్ధ పెట్టిందని.. వీఎఫ్ఎక్స్ కు మరింత మెరుగులు దిద్దడానికే వాయిదా వేస్తున్నట్లుగా మరికొందరు పేర్కొంటున్నారు.

నిజానికి 'ఆది పురుష్' టీజర్ పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. VFX నాసిరకంగా ఉన్నాయని.. కంప్యూటర్ గ్రాఫిక్స్ మరీ దారుణమని.. మోషన్ క్యాప్చర్ పిక్చర్ అని చెప్పి ఒక యానిమేషన్ సినిమాని వదులుతున్నారని రకరకాలుగా కామెంట్స్ చేసారు. ఈ నేపథ్యంలో మంచి అవుట్ ఫుట్ తీసుకురావడం కోసం చిత్ర బృందం మళ్ళీ విజువల్స్ మీద వర్క్ చేయడానికి రెడీ అయిందని టాక్.

అంతేకాదు 'ఆది పురుష్' సినిమాలో ప్రధాన పాత్రల లుక్స్ పై రాజకీయ నాయకులు మరియు హిందుత్వవాదులు అభ్యంతరం చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా పాత్రల చిత్రణ ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభిమానులు - సామాన్య ప్రజలు - విశ్లేషకుల మరియు ట్రేడ్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సినిమాలోని పాత్రల రూపాన్ని సవరించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.

రావణుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ ఒక టర్కిష్‌ గా కనిపించడం.. వానరులను బొమ్మలుగా చూపించడం.. ఆంజనేయుడు లెదర్ జాకెట్ ధరించడం వంటి విషయాలపై అభ్యంతాలు - ట్రోల్స్ వచ్చిన తర్వాత.. వాటిని సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ పనుల కోసం నిర్మాతలకు 100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే 'ఆది పురుష్' సినిమాకు దాదాపు 450 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్లుగా నివేదికలు వస్తున్న తరుణంలో.. ఇప్పుడు మరో వంద కోట్ల అదనపు భారం పడటం అంటే.. నిర్మాతలు గట్టెక్కాలంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా భారీ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ప్రభాస్ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

కాగా, 'ఆది పురుష్' సినిమాలో రాఘవగా ప్రభాస్.. జానకిగా కృతి సనన్ నటిస్తున్నారు. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ - లక్ష్మణ్ గా సన్నీ సింగ్ కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 3డీ - ఐమాక్స్ ఫార్మాట్ లలో ఈ చిత్రాన్ని అందించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.