Begin typing your search above and press return to search.

బాహుబలీ.. నీ సాహసానికి సెల్యూట్

By:  Tupaki Desk   |   23 Oct 2015 6:01 AM GMT
బాహుబలీ.. నీ సాహసానికి సెల్యూట్
X
రాజమౌళి అపజయమే ఎరుగని డైరెక్టరే కావచ్చు.. అతడు ఎంత పెద్ద కల అయినా కని ఉండొచ్చు.. అతడు తీయాలనుకున్న సినిమా బడ్జెట్ వందల కోట్లు కావచ్చు.. కానీ ఒక సినిమా కోసం నాలుగేళ్ల కాలాన్ని ఖర్చు చేయడానికి ఏ హీరో అయినా ముందుకొస్తాడా? వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టేసి.. పెళ్లి ఆలోచనల్ని కూడా వాయిదా వేసేసి.. సినిమాకే నాలుగేళ్ల కాలాన్ని అంకితం చేస్తాడా? ప్రభాస్ ఇలాంటి సాహసానికే పూనుకున్నాడు.

‘బాహుబలి’ కోసం తన జీవితంలోని నాలుగేళ్లు రాసిచ్చాడు.

ఇప్పుడీ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతుండొచ్చు. ప్రభాస్ కు గొప్ప పేరు వచ్చి ఉండొచ్చు. అతడి బాలీవుడ్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుండవచ్చు. ఐతే నాలుగేళ్ల కిందట రాజమౌళి ‘బాహుబలి’ ఆలోచన చెప్పినపుడు ఇదంతా ఊహించాడో లేదో కానీ.. మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నందుకు.. ఓ హీరో తన కెరీర్ మొత్తంలో చేసిన సినిమాలకు ఎంత కష్టపడతాడో అంత కష్టం ఒక్క సినిమాకే పడ్డందుకు మాత్రం అతడు సెల్యూట్ చేయాల్సిందే.

ఇన్నాళ్లూ ప్రభాస్ మన తెలుగు హీరో. ఇప్పుడు భారతీయ కథానాయకుడు. అతడికిప్పుడు హాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ‘బాహుబలి’ విషయంలో అతడు చేసిన సాహసానికి, కష్టానికి వచ్చిన గుర్తింపు. కెరీర్లో వర్షం - ఛత్రపతి - మిర్చి లాంటి సినిమాలన్నీ ఓ ఎత్తు.. ఇప్పుడు ‘బాహుబలి’ మరో ఎత్తు. ‘బాహుబలి.. ది బిగినింగ్’ సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన మన ప్రభాస్.. ‘బాహుబలి.. ది కంక్లూజన్’ మరింత ఉన్నత శిఖరాల్ని అందుకోవాలని ఆశిస్తూ.. అతడికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది ‘తుపాకి.డామ్’.