Begin typing your search above and press return to search.

రావ‌ణ ద‌హ‌నం.. దిల్లీ ఎర్ర‌కోటలో ప్ర‌భాస్ బాణం!

By:  Tupaki Desk   |   6 Oct 2022 3:32 AM GMT
రావ‌ణ ద‌హ‌నం.. దిల్లీ ఎర్ర‌కోటలో ప్ర‌భాస్ బాణం!
X
రామాయ‌ణం స్ఫూర్తితో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ 2023 సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం చారిత్రాత్మక ఎర్రకోట మైదానంలో రావణ దహనాన్ని ప్రదర్శించే ఢిల్లీలోని ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మం రామ్ లీలాకు ఈసారి ఆదిపురుష్ క‌థానాయ‌కుడు ప్ర‌భాస్ హాజరయ్యారు.

లవ్ కుష్ రాంలీలా కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలకు ప్రభాస్ హాజ‌ర‌య్యారు. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఈ వేడుక‌ల‌కు హాజరయ్యారు.

రామ్‌లీలా నిర్వాహకులు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ను పూలమాలలు కండువాతో సత్కరించిన తర్వాత ప్రభాస్ త‌న‌ చేతిలో ఒక గద్దను పట్టుకున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు అభిమానులు ఉత్సాహంగా జేజేలు ప‌లికారు. రావణ దహన్ ముహూర్తం సమీపిస్తుండగా ప్రభాస్ విల్లు - బాణాన్ని తీసుకొని దసరా రోజున రాంలీలా ఆఖరి ఘట్టమైన రావణ దహన్ ప్రారంభానికి గుర్తుగా తన లోపల దాగి ఉన్న‌ భగవంతుడి శ‌క్తిని విల్లులో నింపి బాణం వ‌దిలాడు. అది రావ‌ణుడి ప‌దిత‌ల‌ల‌ను ద‌హించివేసింది.

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' టీజర్ ఇప్ప‌టికే అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఈ చిత్రం క‌థాంశం గురించి రామాయణం గురించి ప్ర‌జ‌ల్లో మ‌రోసారి చ‌ర్చ సాగుతోంది. అయితే పౌరాణిక క‌థాంశంతో రూపొందుతున్న ఆదిపురుస్ VFX ఔట్ పుట్ పై కొంద‌రు అభిమానులు ట్రోల్ చేసారు.

ఆదిపురుష్ పాత్ర‌ల‌ గురించి బిజెపి అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ మాట్లాడుతూ.. ఇతిహాసంలోని పాత్ర‌ల‌ను త‌ప్పుగా చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశం దేశంలోని నాగరికత ప్రజల‌కు తెలుసు. ద‌ర్శ‌కుడిదే ఈ బాధ్య‌త‌. నేను కోపంగా ఉన్నాను. రామాయ‌ణం పాత్ర‌ల‌ను తప్పుడుగా చూప‌డం నాకు బాధను క‌లిగించింది.. అని విమ‌ర్శించారు.

ఆదిపురుష్ క‌థాంశం రామాయ‌ణం స్ఫూర్తితో రూపొందినా ఈ చిత్రంలోని పాత్ర‌ల పేర్లు వేరుగా ఉన్నాయి. శ్రీ‌రాముడి పాత్ర‌ను రాఘ‌వ్ అని .. రావ‌ణుడి పాత్ర‌ను లంకేష్ అని పిలుస్తారు. 'ఆదిపురుష్‌' చిత్రాన్ని టి సిరీస్ - రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇది IMAX 3డి.. 3Dలో 12 జనవరి 2023న థియేటర్లలోకి రానుంది. భూషణ్‌ కుమార్‌- ఓం రౌత్- ప్రసాద్‌ సుతార్‌- రాజేష్‌ నాయర్ నిర్మాత‌లు. హిందీ- తెలుగు- తమిళం- మలయాళం- కన్నడలో అత్యంత భారీగా ఈ చిత్రం విడుద‌ల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.