Begin typing your search above and press return to search.

ప్రభాస్ ను ఏ స్థాయిలో వాడేస్తున్నారంటే..

By:  Tupaki Desk   |   9 July 2016 7:45 AM GMT
ప్రభాస్ ను ఏ స్థాయిలో వాడేస్తున్నారంటే..
X
ఓ భాషకు చెందిన హీరోకు.. ఇంకో భాషలో కాస్త పేరొచ్చిందంటే చాలు.. ఇక వరుసగా అతడి పాత కొత్త సినిమాలన్నింటికీ డబ్బింగ్ చేసి వదిలేయడం మామూలే. చాలావరకు తమిళ హీరోల సినిమాల్ని తెలుగులో ఇలా రిలీజ్ చేస్తుంటారు. ఐతే ఇప్పుడు ఓ తెలుగు హీరోకు కూడా పరాయి భాషల్లో ఇలాంటి క్రేజే కనిపిస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకూ చేరువైపోయాడు ప్రభాస్. దీంతో అతడి పాత సినిమాల్ని మలయాళ.. తమిళ.. హిందీ భాషల్లో వరుస బెట్టి రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడో ఐదేళ్ల కిందట రిలీజైన ‘డార్లింగ్’ సినిమాను సైతం వదలట్లేదు. ఈ సినిమాను ‘ప్రభాస్ బాహుబలి’ పేరుతో తమిళంలో వచ్చే శుక్రవారం రిలీజ్ చేస్తుండటం విశేషం.

‘డార్లింగ్’ సినిమాకు తమిళ అప్పీల్ ఉండటం కలిసొచ్చే అంశం. ఇందులో ప్రభాస్ తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు ప్రభు నటించాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎలాగూ తమిళ ప్రేక్షకులకు పరిచయమే. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా తమిళుడే. తమిళంలో సినిమాలు తీయలేదు కానీ.. దర్శకుడు కరుణాకరణ్ సైతం అక్కడివాడే. ‘బాహుబలి’తో ప్రభాస్ కు కూడా అక్కడ మంచి క్రేజే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘డార్లింగ్’ను తమిళంలోకి అనువాదం చేశారు. తమిళంలో తెలుగు అనువాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘భద్రకాళి ఫిలిమ్స్’ ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయబోతోంది. ‘డార్లింగ్’ ఆల్రెడీ హిందీలోకి అనువాదమైంది. కన్నడ.. బెంగాళీ భాషల్లోకి రీమేక్ అయింది. మరి తమిళంలో ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.