Begin typing your search above and press return to search.

సహాయం చేయడంలోనూ ప్రభాస్ - అల్లు అర్జున్ ప్రత్యేకం

By:  Tupaki Desk   |   28 March 2020 9:10 AM GMT
సహాయం చేయడంలోనూ ప్రభాస్ - అల్లు అర్జున్ ప్రత్యేకం
X
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చూస్తుంటే కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడల్లా తగ్గే అవకాశం కనిపించడం లేదు. రోజు రోజుకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇక దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, ప్రముఖులు కరోనా వ్యాప్తిని అరికట్టడం లో ప్రభుత్వాలు చేస్తున్న కృషికి మద్దతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి నాంది పలికిన తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి - వెంకటేష్ - సూపర్ స్టార్ మహేష్ బాబు - ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - మంచు మనోజ్ - రాజశేఖర్ - అల్లరి నరేష్ - దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ - వి.వి.వినాయక్ - అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. అయితే వీరందరిలో ప్రభాస్ - అల్లు అర్జున్ ప్రత్యేకం అనిపించుకున్నారు.

కారణం ప్రభాస్ టాలీవుడ్ లో అందరు హీరోలకంటే అధికంగా 4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. కేంద్రానికి 3 కోట్ల విరాళం ఇచ్చిన ప్రభాస్ - రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మరో కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక టాలీవుడ్ నుండి భారీ విరాళం ఇచ్చిన వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఏపీ మరియు తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కేరళ రాష్ట్రానికి కూడా కలిపి 1.25 కోట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్ కేంద్రానికి భారీ సాయం ప్రకటించగా - కేరళలో కూడా తనకు ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో బన్నీ కేరళకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఏదేమైనా ఇలా దేశం ఆపదలో ఉన్నప్పుడు తమ వంతు బాధ్యతగా ఇలా స్పందించడం మెచ్చుకోదగ్గ విషయం.